కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు, ప్రభుత్వాలకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

అయితే అక్తర్ ప్రతిపాదనను టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై అక్తర్ స్పందించారు. తానేం చెప్పదల్చుకున్నానో కపిల్ సరిగా అర్ధం చేసుకున్నట్లు లేడని వ్యాఖ్యానించాడు.

Also Read:టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం కూడా అనుమానమే! సీఈఓ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం  కరోనా కారణంగా ప్రతీ ఒక్కరూ ఆర్ధికంగా చితికిపోతున్నారని అందువల్ల ఈ విపత్కర సమయంలో మనమంతా  కలిసికట్టుగా ఉండి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని అక్తర్ అన్నాడు.

భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రపంచం మొత్తం వీక్షిస్తుందని.. అయితే కపిల్ తమ వద్ద డబ్బు కావాల్సినంత ఉందని చెప్పారని అక్తర్ గుర్తుచేశాడు. ఆయన మాటలు నిజమే... కానీ అంతా అలా ఆలోచించరు కదా..? తాను ప్రతిపాదించిన ఈ విషయాన్ని త్వరలోనే పరిగణిస్తారని భావిస్తున్నానని షోయబ్ ఆకాంక్షించాడు.

భారతదేశం గురించి తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటే తనకే ఎక్కువగా తెలుసునని.. హిమాచల్ ప్రదేశ్ నుంచి  కేరళ దాకా అన్ని ప్రాంతాలను తిరిగానని, ప్రజలను కలిశానని అక్తర్ పేర్కొన్నాడు. రెండు దేశాల్లో ఎంతో పేదరికం ఉందని... ప్రజలు ఇబ్బందులు పడుతుంటూ తాను తట్టుకోలేనని షోయబ్ చెప్పాడు.

ఒక వ్యక్తిగా వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం తన బాధ్యత.. పాకిస్తాన్ తర్వాత తనను ఎక్కువగా అభిమానించింది భారతీయులేనని అక్తర్ వెల్లడించాడు. ఇందుకు గాను భారతదేశానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు.

Also Read:కరోనా కోసం మ్యాచ్‌లు ఆడదామన్న అక్తర్: ఇండియా వద్ద బోల్డంత డబ్బుందన్న కపిల్

ఇదే సమయంలో కరోనా గురించి స్పందించిన అక్తర్.. ఒకవేళ మరో ఆరు నెలల పాటు ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించాడు. క్రికెట్‌పై ఆధారపడి బతుకుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని... వారి జీవితాలు ఏం కావాలని ఈ స్పీడ్ స్టార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విరాళాల సేకరణ మ్యాచ్‌లేనని.. తద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తాను ఎంతో విస్తృతంగా ఆలోచించి మాట్లాడుతున్నట్లు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు.