ఆసీస్ బాల్ టాంపరింగ్.. కోహ్లీ, పుజారా ఔట్ అందుకు నిదర్శనం: పాక్ మాజీ ఆటగాడి సంచలన ఆరోపణ
WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ చేసేప్పుడు ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసిందా..?

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసిందా..? టీమిండియా ప్రధాన బ్యాటర్లు అయిన ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలను ఔట్ చేసేందుకు ఆసీస్ కుట్రలకు తెరతీసిందా..? అంటే నిజమేనంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ. ఇందుకు గల సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయని వాపోయాడు.
ఈ మేరకు అతడు ఓ వీడియోలో ఇందుకు సంబంధించి మాట్లాడుతూ.. ‘ముందుగా నేను చెప్పొచ్చేదేంటంటే.. ఈ మ్యాచ్ ను దగ్గరగా చూస్తున్న అంపైర్లు, కామెంటేటర్స్ కు చప్పట్లు కొట్టాల్సిందే. ఎందుకంటే ఆస్ట్రేలియా అంత క్లీయర్ గా బాల్ టాంపరింగ్ చేస్తున్నా కూడా వీరెవరూ గమనించలేదు. అసలు దాని గురించి మాట్లాడిన పాపాన పోలేదు.
దీని గురించి టీమిండియా ఆటగాళ్లు కూడా ఏం మాట్లాడలేదు. ఆసీస్ బాల్ టాంపరింగ్ చేసిందనడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆసీస్ ఇన్నింగ్స్ లో 54 వ ఓవర్ లో షమీ బౌలింగ్ చేసేప్పుడు బంతికి షైన్ లేదు. కానీ మీరు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 16, 17, 18 వ ఓవర్ చూడండి. కోహ్లీ ఔట్ అయిన బాల్ చూడండి. మిచెల్ స్టార్క్ బంతి షైన్ అయ్యే సైడ్ పట్టుకుని వేస్తే బాల్ మాత్రం మరో దిశగా వెళ్లింది. జడేజా కూడా బాల్ ను ఆన్ సైడ్ దిశగా ఆడితే అది ఓవర్ పాయింట్ దిశగా వెళ్లింది. ఇది చూసి అంపైర్లు కళ్లు మూసుకున్నారో ఏమో గానీ ఎవ్వరూ మాట్లాడలేదు. దీని వెనుక కథేంటో దేవుడికే తెలియాలి.
పుజారా ఔట్ అయిన బంతికి కూడా ఇదే జరిగింది. బంతి షైన్ అయిన దిశగా పట్టుకుని అతడు బంతిని సంధిస్తే అది మాత్రం ఔట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్లి ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. ఇది చూసి నాకైతే ఆశ్చర్యమేసింది. బీసీసీఐ ప్రపంచంలోనే సంపన్న బోర్డు. అది కూడా మౌనంగ ఎందుకుందో అర్థం కావడం లేదు. అంటే దీని ప్రకారం బీసీసీఐకి.. ఐసీసీ ఫైనల్స్ కు వెళ్తే సరిపోతుందా..? ఫైనల్ లో రిజల్ట్ ఎలా వచ్చినా అవసరం లేదా...?
అసలు బాల్ తొలి 15- 20 ఓవర్లలో ఎక్కైడనా రివర్స్ స్వింగ్ అవుతుందా..? అది కూడా డ్యూక్ బాల్. నాకు తెలిసినంతవరకూ కూకబుర బాల్ రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశాలుంటాయి గానీ డ్యూక్ బాల్ అయితే 40 ఓవర్లు వేస్తే గానీ దాని నుంచి రివర్స్ స్వింగ్ రాబట్టలేం. మరి అలాంటిది ఆసీస్ బౌలర్లు ఆది నుంచే రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టారు..?’ అని ప్రశ్నించాడు.