England White Ball Coach: కెప్టెన్సీ మాదిరే కోచింగ్ బాధ్యతలు కూడా ఫార్మాట్ వారీగా అప్పుజెప్పుతున్న ఇంగ్లాండ్.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు కూడా కొత్త కోచ్ ను నియమించింది. 2015 నుంచి ఆస్ట్రేలియా మహిళల జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేస్తున్న మాథ్యూ మాట్ ను ఇంగ్లాండ్ వన్డే, టీ20 లకు కోచ్ గా ఎంపిక చేసింది.
ఇటీవలే ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ తో పాటు కోచ్ ను నియమించిన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తాజాగా పరిమిత ఓవర్ల లో తలపడబోయే జట్టుకు కూడా మరో కోచ్ ను నియమించింది. వన్డేలు, టీ20లలో మాథ్యూ మాట్ ను ఆ జట్టు హెడ్ కోచ్ గా ఎంపికచేసింది. టెస్టులకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున హెడ్ కోచ్ గా పనిచేస్తున్న బ్రెండన్ మెక్ కల్లమ్ ను హెడ్ కోచ్ గా నియమించిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ మాట్.. ఇంగ్లాండ్ త్వరలో నెదర్లాండ్స్ జట్టుతో ఆడబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడు. 48 ఏండ్ల మాథ్యూ.. ఆస్ట్రేలియా దేశవాళీ లో క్వీన్స్ లాండ్, విక్టోరియా జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక ఆస్ట్రేలియా మహిళల జట్టు కోచింగ్ సిబ్బందిగా చేరాడు. 2015 నుంచి మాథ్యూ.. ఆసీస్ మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆసీస్ మహిళల జట్టు ఇటీవలే న్యూజిలాండ్ లో ముగిసిన వన్డే క్రికెట్ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
మాథ్యూ మాట్ ఇంగ్లాండ్ పరిమిత ఓవర్లకు హెడ్ కోచ్ గా ఎంపికైన విషయాన్ని ఈసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టు కోసం పలువురు ప్రముఖ క్రికెటర్లను పరిశీలించిన ఇంగ్లాండ్.. చివరికి మాథ్యూ వైపే మొగ్గింది. మాథ్యూ ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టుకు మరిన్ని విజయాలు, ట్రోఫీలు అందిస్తాడని ఈసీబీ సెలెక్షన్ ప్యానెల్ సభ్యులు చీఫ్ ఎగ్జిక్యూటిివ్ ఆఫీసర్ టామ్ హరిసన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ, స్ట్రాటజిక్ అడ్వైజర్ ఆండ్రూ స్ట్రాస్ లు ఫర్ఫార్మెన్స్ డైరెక్టర్ బొబట్ కూడా మాథ్యూ నియామయాకినికే మొగ్గు చూపారు.
కాగా బ్రెండన్ మెక్ కల్లమ్ మాదిరే మాథ్యూకు కూడా ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో అనుబంధం ఉంది. 2009 ఐపీఎల్ సీజన్ లో మాథ్యూ.. కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు. బ్రెండన్ అప్పుడు కేకేఆర్ తరఫున ఆడటం విశేషం. ఇప్పుడు ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులోని మూడు ఫార్మాట్లకు కోచ్ లు గా ఉండటం గమనార్హం.
ఇదిలాఉండగా తనకు ఇంగ్లాండ్ వైట్ బాల్ కోచ్ పదవి దక్కడంపై మాథ్యూ స్పందిస్తూ.. ‘ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్లకు హెడ్ కోచ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆస్ట్రేలియన్ గా నాకు ఇది గర్వకారణం. నాకు యూకే, స్కాట్లాండ్ లలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. యూకేతో నాకు మంచి అనుబంధముంది. ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్), ఇతర ఆటగాళ్లతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను..’ అని తెలిపాడు.
