హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నెలకొన్న సమస్యల ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నెలకొన్న సమస్యల ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. హెచ్‌సీఏలో పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన ఏకసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వర్‌రావు నేడు హైదరాబాద్‌కు రానున్నారు. త్వరలో జస్టిస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జస్టిస్ ఎల్ నాగేశ్వరావు హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా హెచ్‌సీఏ ఆఫీసు బేరర్స్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరాలు సేకరించే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే హెచ్‌సీఏ ఎన్నికలపై మాజీలు దృష్టిసారించారు. ఇప్పటికే విడతల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదపుతున్నారు. హెచ్‌సీఏలో మొత్తం 226 ఓట్లు ఉండగా.. అందులో క్లబ్ మెంబర్స్ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీలు.. క్లబ్ మెంబెర్స్‌తో వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈసారి కూడా హెచ్‌సీఏ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం తిరుగుబాటును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మెజారిటీ సభ్యులు కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీనిని అజార్ తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీఏని పర్యవేక్షించడానికి సుప్రీంకోర్ట్ నియమించిన సూపర్ వైజరీ కమిటీ గత నెలలో ఒక నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏ సభ్యత్వాలపై విస్మయకర వాస్తవాలను ఈ నివేదిక వెల్లడించింది.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిందట సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏ ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్‌రావుతో కూడిన ఏకసభ్య కమిటీని నియమించింది. ఎన్నికల నిర్వహణతో పాటు ఇతర వివాదాలను కూడా ఆయనే పరిష్కరిస్తారని పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నామని తెలిపింది. ఆయన ఎలక్టోరల్ కాలేజీని ఫిక్స్ చేస్తారని పేర్కొంది.
ఖర్చులను అసోసియేషన్ భరిస్తుందని.. న్యాయమూర్తికి కోర్టు నుంచి ఏవైనా ఆదేశాలు అవసరమైన పక్షంలో .. తమ ముందు వాటిని పేర్కొనవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. హెచ్‌సీఏలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసులోని అభ్యర్ధనల రికార్డింగ్‌లను జస్టిస్ లావు నాగేశ్వరరావు ముందు ఉంచాలని.. అవసరమైన మేరకు ఆయన సహాయం తీసుకోవాలని సూచించారు. అయితే ప్రతి స్పోర్ట్స్ అసోసియేషన్‌ను తాము మానిటర్ చేయలేమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు.
ఇక, జస్టిస్ నాగేశ్వర్‌రావు గతంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కోసం ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. ఇప్పటికీ ఐవోఏ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
