ఏదైనా ఉంటే దేశంలో కొట్లాడాలి గానీ అక్కడెక్కడో మాట్లాడటమెందుకు..? రాహుల్ గాంధీపై మాజీ క్రికెటర్ ఫైర్
కాలిఫోర్నియా లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ లో రాహుల్ గాంధీ.. భారత ప్రభుత్వంతో పాటు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, దేశంలో పెట్రేగిపోతున్న అరాచకాలపై మాట్లాడారు.
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కాలిఫోర్నియా లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ లో రాహుల్ గాంధీ.. భారత ప్రభుత్వంతో పాటు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, దేశంలో పెట్రేగిపోతున్న అరాచకాలపై మాట్లాడారు. బీజేపీ.. భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, విద్వేషాన్ని రెచ్చగొట్టాలని, సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారని, అవి సమ్మిళితం కావని అన్నారు.
తాజగాగా ఈ వ్యాఖ్యలపై ఆకాశ్ చోప్రా తన ట్విటర్ వేదికగా స్పందించాడు. చోప్రా తన ట్వీట్ లో.. ‘ఇతర దేశాల నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు మన దేశానికి వచ్చి వారి దేశం గురించి మాట్లాడటం నేనైతే చూడలేదు. మరి మీరెందుకు విదేశీ గడ్డపై ఇలా మాట్లాడుతున్నారు..?
పోరాటాన్ని మీరు మీ స్వంత దేశంలో చేయండి. ఓటర్లను తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోనివ్వండి. ప్రజాస్వామ్యం అంటే ఇది కదా...!’అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ఆకాశ్ ఎక్కడా రాహుల్ పేరును ప్రస్తావించకపోయినా అతడు చేసిన ట్వీట్ సారాంశం మాత్రం రాహుల్ ను ఉద్దేశించిందే.. దీనిపై కాంగ్రెస్ తో పాటు బీజేపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వాదులాడుకుంటున్నారు.
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. విద్వేషాన్ని రెచ్చగొట్టాలని, సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారని, అవి సమ్మిళితం కావని అన్నారు. భారత్ లో ఓపెన్ గా మాట్లాడే సంప్రదాయం ఉందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. గొప్ప నాయకులు, ఆధ్యాత్మిక, రాజకీయ ప్రముఖుల ఉదాహరణలను ఉటంకిస్తూ, వారు (కాంగ్రెస్) శాంతి, సామరస్యం, సంభాషణను ప్రోత్సహించారని అన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఈ సంభాషణలు జరపడం మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్రలో ఉందనీ, ఇది తమకు (కాంగ్రెస్)-వారికి (బీజేపీ) మధ్య తేడా అని తాను అనుకుంటున్నానని చెప్పారు. భారతదేశానికి పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమనీ, విమర్శలకు సిద్ధంగా ఉండాలని, విమర్శలను వినాలని, అదే ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తుందని ఆయన అన్నారు.
కాగా భారత్ తరఫున పది టెస్టులు ఆడిన ఆకాశ్ చోప్రా క్రికెట్ నుంచి తప్పుకున్నాక కామెంట్రీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చెప్రాకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఈ ఛానెల్ లో ఆకాశ్.. భారత క్రికెట్ అంశాలతో పాటు సమకాలీన క్రికెట్ ఇష్యూస్ పై చర్చిస్తాడు. ఐపీఎల్ లో ‘ఆకాశ్‌వాణి’ పేరుతో జియో సినిమాలో ప్రేక్షకులను అలరించిన చోప్రా.. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆటను విశ్లేషించడానికి సిద్ధమవుతున్నాడు. స్టార్ నుంచి అతడి పేరు కామెంట్రీ ప్యానెల్ లిస్ట్ లో లేకపోయినా ఏదో ఓ రూపంలో ఆకాశ్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ పై విశ్లేషణ అందిస్తాడు.