Ranji Trophy 2022 - Sreesanth Re entry: వికెట్ తీశాక బౌలర్ సంతోషానికి అంతే ఉండదు. మరీ ముఖ్యంగా కొంత గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన బౌలర్ బ్యాటర్ ను ఔట్ చేస్తే అతడి ఆత్మవిశ్వాసం కొండంత పెరుగుతుంది. మరి అలాంటిది ఓ బౌలర్ ఏకంగా తొమ్మిదేండ్ల తర్వాత  క్రికెట్ ఆడుతూ వికెట్ సాధిస్తే... 

క్రికెట్ లో వికెట్ తీసినాక బౌలర్లు చేసుకునే వేడుకలు ఈమధ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగినాక బౌలర్లు కూడా.. వికెట్లు తీసినాక అప్పటికీ ట్రెండ్ లో ఉన్న స్టైల్ ను ఫాలో అవుతూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. ఇక ఇలాంటి సెలబ్రేషన్లకు పదేండ్ల క్రితమే పెట్టింది పేరైన భారత క్రికెట్ వెటరన్ పేసర్, స్పీడ్ స్టర్ శ్రీశాంత్.. తొమ్మిదేండ్ల తర్వాత వికెట్ పడగొట్టి తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. వికెట్ తీసిన వెంటనే అతడు పిచ్ పైనే బోర్లా పడుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. 

కేరళ-మేఘాలయ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఇందుకు వేదికైంది. శ్రీశాంత్.. కేరళ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మేఘాలయా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 40 వ ఓవర్ వేశాడు శ్రీశాంత్. అతడు వేసిన బంతిని కట్ చేయబోయిన మేఘాలయ బ్యాటర్ ఆర్యన్ బోరా.. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 

దీంతో వెంటనే శ్రీశాంత్.. తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. పిచ్ పై ఒక్కసారిగా అలాగే బోర్లా పడుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో అతడు చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా శ్రీశాంతే ట్విట్టర్ లో పంచుకున్నాడు.

Scroll to load tweet…

వీడియోను షేర్ చేస్తూ.. ‘తొమ్మిదేండ్ల తర్వాత నా తొలి వికెట్. దేవుడి ఆశీర్వాదం వల్ల ఇదంతా జరిగింది. నా ఆనందానికి అవధుల్లేవు.. అందుకే ఇలా ప్రణమిల్లాను..’ అని రాసుకొచ్చాడు. అయితే శ్రీశాంత్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

Scroll to load tweet…

 ఇక 2013లో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ అతడిపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అతడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాడు. దీనికి సుప్రీం కోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించింది. దీంతో బీసీసీఐ.. అతడి నిషేధాన్ని ఏడేండ్లకు కుదించింది. దీంతో 2020 సెప్టెంబర్ 13 న శ్రీశాంత్ పై నిషేధం తొలిగిపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆడాలని కోరుకున్న శ్రీశాంత్.. గత రెండేండ్లుగా వేలంలో తన పేరును నమోదు చేసుకుంటున్నా.. అతడిని కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రావడం లేదు. కాగా 2007లో ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టుతో పాటు 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన జట్టులో శ్రీశాంత్ సభ్యుడు.