సారాంశం

Samiur Rahman and Moshrraf Hussain: బంగ్లాదేశ్ క్రికెట్ కు మంగళవారం భారీ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు ఒకే రకమైన వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. దీంతో బంగ్లా క్రికెట్ లో విషాదం నెలకొంది. 

బంగ్లాదేశ్ క్రికెట్ కు  బ్రెయిన్ ట్యూమర్ షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన ఇద్దరు క్రికెటర్లను ఈ వ్యాధి ఒకే రోజు బలితీసుకుంది. బంగ్లాదేశ్ తొలి వన్డే లో సభ్యుడైన సమియుర్ రెహ్మాన్ (68) తో పాటు ఆ దేశ మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ మొషారఫ్ హుస్సేన్  (40) లు ఈ ప్రాణాంతక వ్యాధి భారీన పడి మంగళవారం తుది శ్వాస విడిచారు.  ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వెల్లడించింది. ఈ  ఇద్దరి మరణంతో బంగ్లాదేశ్ క్రికెట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించిన ఇద్దరు క్రికెటర్లకు ఆ దేశ క్రీడాకారులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

సమియుర్ రెహ్మన్.. బంగ్లాదేశ్ తరఫున రెండు మ్యాచులాడాడు.  1986లో బంగ్లా తొలి వన్డే ఆడింది. బంగ్లా జాతీయ జట్టుతో పాటు డాకా ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ బిమన్ వంటి స్థానిక జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.  క్రికెట్ తో పాటు రెహ్మాన్.. బాస్కెట్ బాల్ కూడా ఆడాడు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక  అతడు అంపైర్ గా కూడా సేవలందించాడు. 

 

ఇక మొషరాఫ్ హుస్సేన్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్ తరఫున అతడు 2008-16 మధ్య కాలంలో 5 వన్డేలు ఆడాడు.  ఎడం చేతి వాటం స్పిన్నర్ అయిన  హుస్సేన్ 4 వికెట్లు కూడా తీశాడు.  జాతీయ జట్టులో  పెద్దగా రాణించకపోయినా దేశవాళీలో మాత్రం  వికెట్ల పండుగ చేసుకున్నాడు.  దేశవాళీ టోర్నీలలో హుస్సేన్.. 572 వికెట్లు పడగొట్టి స్టార్ స్పిన్నర్ గా గుర్తింపు పొందాడు.  

 

కాగా.. హుస్సేన్ 2018లో బ్రెయిన్ ట్యూమర్ బారీన పడ్డాడు.  ఈ ఇద్దరూ బ్రెయిన్ ట్యూమర్ కారణంగా గత కొంతకాలంగా  ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. కానీ  పరిస్థితి విషమించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారని  బీసీబీ తెలిపింది.