న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసిఏ) సర్వసభ్య సమావేశంలో అధికారులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పరస్పరం కొట్టుకున్నారు, ముష్టియుద్ధానికి దిగారు. దీంతో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది. 

సమావేశంలో వారు ముష్టియుద్ధానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఓ సూచన చేశారు. 

డీడీసీఎ అధికారులపై గంభీర్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీడీసీఏ ఆలౌట్ అయిందని, ఒక అవమానకరమైన డకౌట్ అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిపై మరొకరు ఎలా దాడి చేసుకుంటున్నారో చూడండని, డీడీసీఏను వెంటనే రద్దు చేసి ఘర్షణకు దిగినవారందరిపై జీవిత కాలం నిషేధం విధించాలని ఆయన కోరారు. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ గంగూలీని, జే షాలను కోరుతున్నట్లు తెలిపారు. తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 

డీడీసీఏ అధికారుల ముష్టియుద్ధానికి సంబంధించిన 43 సెకన్ల వీడియోలో సభ్యులు పరస్పరం దాడి చేసుకోవడం, నెట్టుకోవడం, తిట్టుకోవడంతో స్పష్టంగా కనిపిస్తోంది. సమావేశంలో ఆమోదించిన అజెండాను కొంత మంది సభ్యులు అంగీకరించకపోవడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రాజన్ మాన్ చంద్ కూడా గొడవకు దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.

గొడవకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించకుండా డీడీసీఎ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రమైన చలి కాలంలో కూడా ఆదివారంనాడు జరిగిన సమావేశానికి హాజరై బోర్డు డైరెక్టర్లకు మద్దతు పలికినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రకటన విడుదలైంది.