INDvsAUS: భారత జట్టు తరఫున ఫైనల్ లెవన్ లో ఉన్నా లేకున్నా కెఎల్ రాహుల్‌కు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే తప్పడం లేదు. తాజాగా అహ్మదాబాద్ టెస్టులో రాహుల్ ను పక్కనబెట్టినా ఓ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో కెఎల్ రాహుల్ తుది జట్టులో చోటు దక్కించుకోపోయాడు. ఢిల్లీ, నాగ్‌పూర్ లలో వైఫల్యాలు, గత ప్రదర్శనల కారణంగా రాహుల్ ఇండోర్ టెస్టులో చోటు కోల్పోయాడు. నాలుగో టెస్టులో కూడా రాహుల్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు కలిసి ఇరు జట్ల ఆటగాళ్లను కలిసి వారితో కరచాలనం చేయడమే గాక కొద్దిసేపు మ్యాచ్ నూ వీక్షించారు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మ.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆటగాళ్లను పరిచయం చేశాడు. ఒక్కొక్క ఆటగాడి దగ్గరికి వెళ్లిన మోడీ వారితో కరచాలనం చేస్తూ తర్వాత గ్రూప్ ఫోటో కూడా దిగాడు. అయితే ఈ ఫోటోలన్నింటికంటే మోడీ.. కెఎల్ రాహుల్ తో దిగిన ఫోటో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
రాహుల్ - మోడీల ఫోటో నెట్టింట వైరల్ గా మారిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఓ ట్విటర్ యూజర్.. ‘రాహుల్ తో మోడీ: మా దగ్గర కూడా ఒక రాహుల్ (కాంగ్రెస్ ఎంపీ) ఉన్నాడు. అచ్చం అతడు కూడా నీలాగే ఆడతాడు...’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్.. ‘కెఎల్ రాహుల్ నేడు తుది జట్టులో లేడు.. ఎందుకంటే మోడీ ఉండగా రాహుల్‌లు సరైన ప్రదర్శన చేయలేరు..’ అని రాసుకొచ్చాడు.
ఓ యూజర్ అయితే ఏకంగా.. ‘నీకు ఆ పేరు అచ్చిరాలేదు. నువ్వు ముందు ఆ పేరు మార్చుకో. నీ దశ తిరుగుద్ది..’ అని మోడీ అన్నట్టుగా మీమ్స్ సృష్టించాడు. ఇక రోహిత్ శర్మ పక్కన మోడీ నిలుచున్న ఫోటోపై పలువురు నెటిజన్లు.. ‘కెఎల్ రాహుల్ ప్లేస్ గోవిందా..’అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (104 నాటౌట్), కామోరూన్ గ్రీన్ (49 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు మరో స్పెషలిస్టు బ్యాటర్ కూడా క్రీజులో ఉండటంతో ఆస్ట్రేలియా 400 పై కన్నేసింది. ఆట రెండో రోజు ఉదయం ఈ ముగ్గురినీ వీలైనంత త్వరగా ఔట్ చేయకుంటే భారత్ కు ఈ టెస్టులో కష్టాలు తప్పవు.
