ICC ODI WC 2023: ఇదే వేదికలో జింబాబ్వే - నెదర్లాండ్స్ మధ్య రెండ్రోజుల క్రితం మ్యాచ్ జరిగింది. ఇది ముగిసిన ఆరు గంటల తర్వాత మైదానంలో మంటలు వ్యాపించాయి.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు జింబాబ్వే లోని హరారే, బులవాయోలో ఐసీసీ క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్న హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
జూన్ 20న ఇదే వేదికలో జింబాబ్వే - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇది ముగిసిన ఆరు గంటల తర్వాత మైదానంలోని సౌత్ వెస్ట్ గ్రాండ్ స్టాండ్‌లో మంటలు వ్యాపించాయి.
కాజిల్ కార్నర్ లో అంటుకున్న మంటలు క్రమంగా పైకి ఎగియడంతో పైకప్పు భాగంలో ఉన్న చెట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సాయంతో వాటిని ఆర్పారు. వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్ లు ఇదే వేదికలో జరుగుతుండటంతో ఐసీసీ సెక్యూరిటీస్ టీమ్, జింబాబ్వే క్రికెట్ టీమ్ లు స్టేడియంలో తనిఖీలు నిర్వహించాయి.
హరారే స్పోర్ట్స్ క్లబ్ లోని సౌత్ వెస్ట్ గ్రాండ్ స్టాండ్ లో ఫైర్ తలెత్తడంతో ప్రమాద ప్రభావం దాని పరిధిలోనే ఉండటంతో మ్యాచ్ లు యాథావిధిగా జరుగుతాయని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా ఈనెల 18న మొదలైన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లలో భాగంగా ఇప్పటివరకు 8 మ్యాచ్ లు జరిగాయి. నేపాల్, జింబాబ్వే, వెస్టిండీస్, యూఎస్ఎ, శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఓమన్, నెదర్లాండ్స్, స్కాట్లండ్ లు రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్ లు ఆడుతున్నాయి. జూన్ 27 వరకూ లీగ్ దశ మ్యాచ్ లు ముగుస్తాయి.
జూన్ 29 నుంచి సూపర్ సిక్సెస్ దశకు సంబంధించిన మ్యాచ్ లు మొదలవుతాయి. జులై 09కి క్వాలిఫయర్ మ్యాచ్ లు ముగుస్తాయి.
