టీమిండియా పేస్ బౌలర్ అశోక్ దిండా ఐపిఎల్ కు గత రెండు సీజన్ల నుండి దూరంగా వుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడి పేరు ఐపిఎల్ లో మారుమోగుతోంది. అతడి బౌలింగ్ గణాంకాలను  గుర్తుచేసుకుని పరోక్షంగా హేళన చేస్తున్నట్లుగా రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు ఓ ట్వీట్ చేసింది. తమ ఆటగాన్ని పొగిడే క్రమంలో ఆర్సిబి దిండాను తక్కువచేస్తూ అవమానించింది. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన దిండా ఆర్సిబి వ్యవహారం పై ఫైర్ అయ్యాడు. 

గతంలో దిండా ఇదే ఆర్సిబి జట్టు తరపున ఐపిఎల్ ఆడాడు. ఇలా అతడు ఐపిఎల్ తో పాటు భారత్ తరపున ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచుల్లో భారీగా పరుగులు సమర్పించుకునేవాడు. 2017 ముందు జరిగిన ఐపిఎల్ సీజన్లతో పాటు 2010-2013 మధ్య  భారత్ తరపున ఆడిన మ్యాచుల్లోనూ ప్రత్యర్థులు ఇతడి బౌలింగ్ ను చిత్తుచిత్తు చేసేవారు. దీంతో ఎవరైన బౌలర్ అధికంగా పరుగులు ఇచ్చుకుంటే అభిమానులు అతన్ని దిండా తో పోలుస్తూ ఎగతాళి చేయడం ఆరంభించారు. 

ఈ క్రమంలోనే ఆర్సిబి కూడా తమ మాజీ ఆటగాని పేరు వాడుకుంటూ వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేసింది. ఇటీవల ఆర్సిబి కింగ్స్ లెవెన్ పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో బౌలర్ ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ను తన బౌలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ మ్యాచ్ లో ఉమేశ్  నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు. ఇలా ఆర్సిబి విజయంలో ఉమేశ్ కీలక పాత్ర పోషించాడు. 

దీంతో అతన్ని పొగిడే క్రమంలో ఆర్సిబి యాజమాన్యం దిండాను పేరును వాడింది. ఆర్సిబి అధికారిక ట్విట్టర్లో ఉమేశ్ ప్రదర్శనపై స్పందిస్తూ '' దిండా  అకాడమిలో ఏం జరిగింది?'' అంటూ ట్వీట్ చేసింది. గత మ్యాచుల్లో భారీగా పరుగులు సమర్పించుకున్న ఉమేశ్ ను దిండాతో పోలుస్తూ ఇలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.    

ఈ ట్వీట్ పై తాజాగా స్పందించిన దిండా తన కెరీర్‌లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ఫేస్ బుక్ లో తన గణాంకాలకు సంబంధించిన వివరాలను దిండా పోస్ట్ చేశాడు.బెంగాల్‌ రంజీ జట్టు తరఫున తాను అద్భుతంగా  ఆడి వికెట్లు తీసిన విషయంతో పాటు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 400 వికెట్లు పడగొట్టిన విషయాన్ని కూడా దిండా గుర్తు చేశాడు. ‘హేటర్స్‌.. నా ఈ గణాంకాలు చూడండి. వీటిని యూసైనా నాపై నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అంటూ దిండా ఆర్సిబిని గట్టిగా హెచ్చరించాడు.