IND vs SA T20I:ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం చిన్నస్వామి వేదికగా తుది టీ20 వర్షార్పణం అయింది. అయితే చిన్నస్వామి స్టేడియం నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. 

కంటిసైగతో ప్రపంచ క్రికెట్ ను శాసించగల శక్తి.. అత్యంత సంపన్నవంతమైన బోర్డు గా ఎనలేని పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీరు ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా ఉంది. ఐపీఎల్ తో పాటు ఇటీవలే నిర్వహించిన ఈ లీగ్ మీడియా హక్కుల విషయంలో భారీగా ఆర్జించిన బీసీసీఐ.. దాని సంపదనంతా ఎక్కడికి తీసుకెళ్తుందని టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. స్టేడియాల నిర్వహణ పై వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇంతకీ వాళ్ల కోపానికి కారణమేంటంటే.. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ఆదివారం ఇండియా-సౌతాఫ్రికాల మధ్య ఐదో టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షానికి చిన్నస్వామి స్టేడియం గ్రౌండ్ లోనే కాదు.. స్టాండ్స్ కూడా తడిసిపోయాయి.

స్టేడియంలోని స్టాండ్స్ లో పలు చోట్ల రూఫ్ లు పగిలిపోయి.. పైన పడ్డ వర్షపు నీరంతా కింద కూర్చున్న ప్రేక్షకుల మీద కుమ్మరించింది. దీంతో చాలా మంది అభిమానులు ‘ఇదేనా స్టేడియాలను నిర్వహించే తీరు..?’ అని బోర్డును ప్రశ్నిస్తున్నారు. పేరుకు ప్రపంచ సంపన్న క్రికెట్ బోర్డు అయినప్పటికీ స్టేడియాలలో మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు ఇదేం ఖర్మ..? అని విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇదే విషయమై మ్యాచ్ చూడటానికి వచ్చిన పలువురు అభిమానులు ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ బీసీసీఐని ఓ ఆటాడుకున్నారు.‘ఈరోజు మ్యాచ్ రద్దైన దానికంటే ఇక్కడి పరిస్థితులే మరింత నిరాశకు గురిచేశాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు.. కానీ ఫ్యాన్స్ కు మాత్రం ఇలాంటి దిక్కుమాలిన దుస్థితి. బీసీసీఐ, కర్నాటక స్టేట్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా వీటిని చూస్తే బాగుండు..’ అని ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Scroll to load tweet…

మీడియా రైట్స్, ఇతర మార్గాల ద్వారా కోటానుకోట్ల ఆదాయం పొందుతున్న బీసీసీఐ.. స్టేడియాలలో మ్యాచులు చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మంచి వసతులు కల్పించే విధంగా కృషి చేయాలని హితబోధ చేస్తున్నారు. బోర్డు పై కనకవర్షం కురిస్తే మాపై ఈ వర్షం కురిపిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా.. సిరీస్ డిసైడర్ మ్యాచ్ చూద్దామని చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తిన అభిమానులకు వర్షం రూపంలో తీవ్ర నిరాశ ఎదురైంది. మ్యాచ్ జరగకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. వేలకు వేలు పెట్టి మ్యాచ్ చూడటానికి వస్తే వాన తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన చెందారు.ఇప్పుడు వాళ్లకు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. టికెట్ రేట్లలో 50 శాతం రీఫండ్ చేయనున్నట్టు కేఎస్సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ తెలిపారు.