IPL Media Rights: రాబోయే ఐదేండ్ల కాలానికి గాను మీడియా హక్కుల వేలం ద్వారా భారీగా ఆర్జించిన బీసీసీఐ పై సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయి బీసీసీఐకి భారీ ఆదాయం చేకూర్చాయి. మూడు రోజుల పాటు ముంబైలో ముగిసిన ఈ వేలం ప్రక్రియ ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయం సమకూరింది. మీడియా రైట్స్ విషయంలో పోటాపోటీగా ఢీకొన్న బడా కార్పొరేట్లు.. ఎక్కడా తగ్గకుండా వేలాన్ని పెంచుకుంటూ పోయారు. కాగా.. తాజాగా ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు మీమ్స్, వీడియోస్ తో బీసీసీఐ పై జోకులు పేల్చుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఈ రైట్స్ ప్రక్రియలో... ప్యాకేజీ ఎ (ఉపఖండంలో టీవీ ప్రసారాలు) ని డిస్నీ స్టార్ రూ. 23,575 కోట్లకు దక్కించుకోగా బి (ఉపఖండంలో డిజిటల్ హక్కులు) ప్యాకేజీని రూ. 20,500 కోట్లకు వయాకామ్ దక్కించుకుంది.
సి ప్యాకేజీ (ఎంపిక చేసిన ప్రత్యేక మ్యాచులు)ని రూ. 3,273 కోట్లకు దక్కించుకున్న వయాకామ్.. డి ప్యాకేజీ (ఉపఖండం వెలుపల) ని కూడా అదే సొంతం చేసుకుంది. అయితే డిజిటల్ హక్కుల విషయంలో వయాకామ్.. టైమ్స్ ఇంటర్నెట్ తో భాగస్వామ్యం కానుంది.
ఇక మీమర్స్ విషయానికొస్తే.. గతంలో టీవీతో పాటు డిజిటల్ హక్కులను కలిగి ఉన్న స్టార్ కు ఇప్పుడు కేవలం టీవీ ప్రసారాలు మాత్రమే మిగిలాయి. డిజిటల్ హక్కులు వయాకామ్ కు దక్కాయి. ఈ నేపథ్యంలో మీమర్స్.. పలు సినిమాలలోని సన్నివేశాలను ఇందుకు జోడించి మీమ్స్ క్రియేట్ చేశారు.
ఓ వ్యక్తి తన కింద డబ్బును పరుచుకుని.. ‘మనదే ఇదంతా’ అన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్న మీమ్ అందరినీ ఆకట్టుకుంటున్నది.
నెటిజన్లే గాక దేశంలో పలు చర్చనీయాంశాలపై తనదైన శైలిలో స్పందించే అమూల్ బేబీ కూడా ఐపీఎల్ మీడియా రైట్స్ పై స్పందించింది. ఐపీఎల్ ను ఇంక్రెడిబుల్ ప్రాఫిటబుల్ లీగ్ గా మార్చి దానికి కొత్త అర్థాన్నిచ్చింది.
