Faf du Plessis: ఫాఫ్ డుప్లెసిస్ టీ20 క్రికెట్ లో 8వ సెంచరీ బాదాడు. అలాగే, బాబర్ ఆజమ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.

Faf du Plessis: డల్లాస్‌లోని గ్రాండ్ ప్రేయరీ స్టేడియంలో మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 21వ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ఎంఐ న్యూయార్క్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టెక్సాస్ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డుప్లెసిస్, కేవలం 53 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన సెంచరీ నాక్ లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 194.34తో తన ఆటను కొనసాగించాడు.

టెక్సాస్ భారీ స్కోరు.. 39 పరుగుల గెలుపు

టెక్సాస్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు నమోదు చేసింది. లక్ష్య చేధనలో ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. టెక్సాస్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20లో 8వ సెంచరీ.. రోహిత్, వార్నర్ సరసన డుప్లెసిస్

ఈ సెంచరీ డుప్లెసిస్‌కు టీ20 క్రికెట్‌లో ఎనిమిదవది. దీంతో అతను టీ20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. మైకల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ల సరసన చేరాడు. వీరందరికీ 8 సెంచరీలు ఉన్నాయి. టాప్‌లో ఉన్న క్రిస్ గేల్‌కు 22 సెంచరీలు కొట్టగా, బాబర్ ఆజమ్‌కు 11, రైలీ రుసో, విరాట్ కోహ్లీలకు 9 చొప్పున సెంచరీలు సాధించారు.

ఎంఎల్సీలో డుప్లెసిస్ మరో రికార్డు

ఎంఐ న్యూయార్క్‌పై చేసిన ఈ సెంచరీ డుప్లెసిస్‌కు ఎంఎల్సీలో మూడోది. మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. 40 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్‌నెస్‌తో ప్రత్యర్థి బౌలింగ్ ను తన బ్యాట్ తో దంచికొడుతున్నాడు.

బాబర్ ఆజమ్ రికార్డును బద్దలు కొట్టిన కెప్టెన్ డుప్లెసిస్

కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఫాఫ్ డుప్లెసిస్ రికార్డు సాధించాడు. మైకల్ క్లింగర్, బాబర్ ఆజమ్‌లను అధిగమించి కెప్టెన్‌గా 8వ సెంచరీని సాధించాడు. బాబర్, క్లింగర్‌లకు చెరో 7 సెంచరీలు కొట్టారు. విరాట్ కోహ్లీ, జేమ్స్ లకు చెరో 5 సెంచరీలు ఉన్నాయి.

40 ఏళ్ల వయసులోనూ రికార్డులు మోత మోగిస్తున్న డుప్లెసిస్

ఫాఫ్ డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో టీ20ల్లో రెండో సెంచరీని నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు. టీ20 చరిత్రలో 40 ఏళ్ల తర్వాత రెండు సెంచరీలు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. గ్రీమ్ హిక్, పాల్ కాలింగ్ వుడ్ రికార్డులను అధిగమించాడు. వీరికి చెరో సెంచరీ ఉంది.