Fact Check : మిచెల్ మార్ష్ ప్రపంచకప్ పై కాళ్లు పెట్టలేదా? స్టూల్ పై పెట్టాడా? ఏది నిజం?
వరల్డ్ కప్ ఫొటో మీద కాళ్లు పెట్టిన మిచెల్ మార్ష్ ఫొటో మీద జరుగుతున్న చర్చ వాస్తవమా? కాదని చెబుతున్న దాంట్లో ఎంత నిజం ఉంది? ఫ్యాక్ట్ చెక్ ఏమంటుంది?
తెలుగు ఫేస్‌బుక్ యూజర్ ఒకరు షేర్ చేసిన ఒక పోస్ట్‌లో, ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తరువాత ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టలేదని, స్టూల్‌పై పెట్టాడని ఓ ఫొటో షేర్ చేశారు.
ఇటీవల జరిగిన 2023 ICC పురుషుల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. దీని తరువాత క్రికెటర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీపై తన కాళ్లను పెట్టి, విశ్రాంతి తీసుకుంటున్నట్లు చూపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూసింది. కాసేపట్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది. నెట్టింట తీవ్ర వ్యతిరేకతకు, చర్చకు దారితీసింది. అయితే ఈ ఫొటో ఫేక్ అని కొన్ని వాదనలు వెలుగు చూశాయి.
ఈ ఫోటో వైరల్ అయి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన కొద్ది రోజులకు ట్రోఫీ మీద మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో మార్ఫింగ్ చేయబడిందని ఓ తెలుగు ఫేస్ బుక్ యూజర్ ఒక పోస్ట్ షేర్ చేశారు. ఒరిజినల్ ఫొటోగా చెప్పబడుతున్న ఫొటోలో మార్ష్ స్టూల్ మీద కాళ్లు పెట్టుకున్నట్టుగా ఉంది. అతను షేర్ చేసిన పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. ఒకదాంట్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ తన పాదాలను స్టూల్‌పై ఉంచినట్లు కనిపిస్తుండగా, మరోదాంట్లో ట్రోఫీపై కాళ్లు పెట్టనట్లు కనిపిస్తుంది.
దీనిపై ఫ్యాక్ట్ చెక్ సంస్థ పరిశీలన చేసింది. ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో నిజం అని తేల్చింది. తాము వైరల్ ఇమేజ్‌ని నిశితంగా పరిశీలించామని, వీటిలో కొన్ని తేడాలు కనిపించాయని తెలిపింది. స్టూలు మీద పాదాలు పెట్టినట్లు ఉన్న ఫొటో అస్పష్టంగా ఉందని.. కాళ్లు పెట్టిన విధానం.. సోఫాలో కూర్చున్న విధానంలో కూడా తేడాలు ఉన్నాయని తెలిపింది. దీన్నిబట్టి స్టూల్ మీద కాళ్లు పెట్టుకున్నారన్న ఫొటో ఫేక్ అని, డిజిటల్‌గా చేంజ్ చేశారని తెలిపింది.
ఈ రెండు ఫొటోల్లో ఒరిజినల్ గుర్తించడానికి స్టూల్‌తో ఉన్న ఫోటోను రివర్స్-ఇమేజ్ లో చెక్ చేశారు. అది ప్రపంచ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాళ్లను పెట్టిన ఫొటో ఒరిజినల్ అని తేల్చింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, మొదట ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ చిత్రాన్ని తన అధికారిక ఖాతాలో (@patcummins30) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అందులో మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీపై తన కాళ్లకు పెట్టడం చూడవచ్చు. ఇదే ఫోటోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది.
చివరికి ఏం తేల్చారంటే..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీపై తన పాదాలు పెట్టి, విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో నిజమైనది.. స్టూల్‌పై పాదాలతో ఉన్న ఫోటో ఎడిట్ చేయబడింది. కాబట్టి, ఈ క్లెయిమ్ నకిలీదని గుర్తించాం అని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.