భారత క్రికెట్ నియంత్రణా మండలి నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గంగూలీని నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సుప్రీంకోర్టు నియమించిన సీఓఏ కమిటీ బాధ్యతల నుంచి తప్పుకుని.. గంగూలీకి బోర్డు పగ్గాలు అప్పగించింది. దాదాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా , అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ ట్రెజరర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Also Read:మీ కొత్త ఇన్నింగ్స్‌ ఆదిరిపోవాలి: గంగూలీకి మమత గ్రీటింగ్స్

ఒక మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించారు.

2014లో సునీల్ గావస్కర్, శివలాల్ యాదవ్ సైతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ అది తాత్కాలికం మాత్రమే. అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

దాదా పది నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో గంగూలీ ఉండటంతో లోధా కమిటీ నిబంధనల ప్రకారం ‘‘తప్పనిసరి విరామం’’ కింద వచ్చే ఏడాది జూలైలో పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల విరామం తర్వాత తిరిగి బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీ చేయవచ్చు.

భారత క్రికెట్ నియంత్రణా మండలి అధ్యక్ష పదవికి గంగూలీ గత సోమవారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఆయన వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు సోమవారంతో గడువు ముగుస్తుండటంతో పాటు ఇప్పటి వరకు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంకానుంది.

టీమిండియా మాజీ కెప్టెన్ అయిన గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిజేష్ పటేల్, సౌరవ్ గంగూలీ మధ్య అధ్యక్ష పదవికి పోటీ నెలకొన్న స్థితిలో విస్తృతమైన చర్చల నేపథ్యంలో బ్రిజేష్ పటేల్ తప్పుకున్నారు.

Also Read: రవిశాస్త్రి ఏం చేశాడని మాట్లాడాలి..? గంగూలీ షాకింగ్ కామెంట్స్

అనేక రాష్ట్ర సంఘాల ప్రతినిధులు దాదాకే మద్ధతు పలికారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి పదవికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా, కోశాధికారిగా అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ నామినేషన్ వేశారు.