బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామకం దాదాపు ఖరారయ్యింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత క్రికెట్ నియంత్రణా మండలి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న గంగూలీకి హృదయపూర్వక అభినందనలు. మీ జట్టుకు శుభాకాంక్షలు. మీరు భారత్‌ను, బెంగాల‌్‌ను గర్వించేలా చేశారని దీదీ కొనియాడారు.

బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మీరు అందించిన సేవలు గర్వకారణమని.. కొత్త ఇన్నింగ్స్‌లో దూసుకెళ్లాలని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణా మండలి అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నామినేషన్ వేశారు.

సోమవారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్లకు సోమవారంతో గడువు ముగుస్తుండటంతో పాటు ఇప్పటి వరకు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంకానుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

బ్రిజేష్ పటేల్, సౌరవ్ గంగూలీ మధ్య అధ్యక్ష పదవికి పోటీ నెలకొన్న స్థితిలో విస్తృతమైన చర్చల నేపథ్యంలో బ్రిజేష్ పటేల్ తప్పుకున్నారు. అనేక రాష్ట్ర సంఘాల ప్రతినిధులు దాదాకే మద్ధతు పలికారు.