భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన పొలాక్... తన తరంలో సచిన్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు.

ఆ సమయంలో మాస్టర్ బ్లాస్టర్‌ను ఔట్ చేయడానికి తమ జట్టు ఎలాంటి వ్యూహాలు రూపొందించేది కాదని పొలాక్ చెప్పాడు. లిటిల్ మాస్టర్ తప్పు చేసేంత వరకు ఎదురుచూసే వాళ్లమని... అలాగే పరిస్ధితులకు తగ్గట్టు ఆడటంలో సచిన్ ఆరితేరాడని గుర్తుచేసుకున్నాడు.

తను చాలా త్వరగా ఆటను అర్ధం  చేసుకుంటాడని పొలాక్ తెలిపాడు. కాగా.. వన్డేల్లో పొలాగ్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ తొమ్మిది సార్లు ఔటయ్యాడు. సచిన్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో పొలాక్ ‌నాలుగో స్థానంలో నిలిచాడు.

ఇదే టాక్ షోలో విండీస్ మాజీ పేసర్ మైఖేల్ హోల్డింగ్ మాట్లాడుతూ.. తన సహచర ఆటగాడు, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సర్ వివ్‌ రిచర్డ్స్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ప్రశంసించాడు.

ఆ రోజుల్లో దిగ్గజ బౌలర్లుగా గుర్తింపు పొందిన కివీస్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ, ఆసీస్ పేసర్ డెన్సిస్ లిల్లీ, పాక్ బౌలర్ అబ్ధుల్ ఖాదిర్, టీమిండియా బౌలర్ బిషన్ సింగ్ బేడీ, ఇంగ్లాండ్ బౌలర్ ఇయాన్ బోథమ్‌ లాంటి వారిపై వివ్ రిచర్డ్స్ ఆధిపత్యం చెలాయించాడని మైఖేల్ హోల్డింగ్ గుర్తుచేసుకున్నాడు.