టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్కును ఢీకొట్టగా.. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రవీణ్ కుమార్, అతడి కొడుకు ప్రయాణిస్తున్న కారును ట్రక్కును ఢీకొట్టగా.. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మీరట్‌లోని ముల్తాన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి పాండవ నగర్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు బాగా దెబ్బతింది. అయతే ప్రవీణ్, అతడి కుమారుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం తాను, తన కొడుకు బాగానే ఉన్నట్టుగా ప్రవీణ్ కుమార్ పీటీఐకి చెప్పారు. ‘‘ఇది చాలా దారుణంగా ఉండేది. దేవుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాము. నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మా కుటుంబంలో ఒకరిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. కానీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక భారీ ట్రక్కు నా కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దేవునికి ధన్యవాదాలు.. అది ఒక పెద్ద కారు, లేకపోతే గాయాలు అయ్యి ఉండేవి’’ అని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే తొలుత కారు బంపర్ విరిగిపోయిందని భావించానని.. కానీ కారు బాగా దెబ్బతిందని తెలిపారు. ఇక, ఈ ప్రమాదం.. గత ఏడాది జూన్‌లో రిషబ్ పంత్‌కు జరిగిన ఘోర ప్రమాదాన్ని గుర్తుకు తెస్తుందని పలువురు పేర్కొన్నారు. 

ఇక, ప్రవీణ్ కుమార్ తన కెరీర్‌లో భారత్ తరపున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడారు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన సీబీ సిరీస్‌లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారత జట్టు విజయం ప్రవీణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.