Ashwin Defends IPL Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై కారణాలేమీ లేకుండా విమర్శలు చూపేవాళ్లపై అశ్విన్ మండిపడ్డాడు. ఐపీఎల్ గురించి మాట్లాడే ముందు వాళ్లు తమ...
త్వరలో ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’ కొత్త సిజీన్ కు సంబంధించిన షెడ్యూల్ పై విమర్శలు చేసిన ఇంగ్లాండ్ స్పోర్ట్స్ జర్నలిస్టుపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ సంగతి తర్వాత.. ముందు నీ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సంగతి చూస్కో.. అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు జర్నలిస్టుకే కాదు.. ఐపీఎల్ షెడ్యూల్ పై విమర్శలు చేస్తున్న మరికొంతమందికి కూడా అశ్విన్ ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పాడు.
ఇంగ్లాండ్ కు చెందిన లారెన్స్ బూత్.. ప్రముఖ పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. అతడు క్రీడా ప్రతినిధి. ఐపీఎల్ షెడ్యూల్ కు సంబంధించి భారత్ కు చెందిన ఓ క్రీడా పాత్రికేయడు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ఐపీఎల్-2022 షెడ్యూల్ క్లీయరైంది. మార్చి 26 నుంచి మే 29 వరకు 74 మ్యాచులు జరుగుతాయి’ అని ట్వీట్ చేశాడు.
అయితే ఈ ట్వీట్ కు లారెన్స్ స్పందిస్తూ.. ‘ఏడాదిలో 1/3 వ వంతు’ అని రాసుకొచ్చాడు. అంతేగాక ఇటీవలే వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకోగా అతడు వ్యక్తిగత కారణాలను చెప్పి టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ సందర్భంగా కూడా పలువురు.. ఐపీఎల్ సుదీర్ఘ షెడ్యూల్ పై విమర్శలు సంధించారు.
ఈ నేపథ్యంలో అశ్విన్ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 1/3 వ వంతు ఆక్రమించిందని లారెన్స్ ట్వీట్ చేశాడు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్- ఫుట్బాల్) ఆరునెలలు పాటు జరుగుతుంది. మరి దాని సంగతేంటి..? ఐపీఎల్ లో ఆటగాళ్లకు రెస్ట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మేము వారానికి ఆడేది రెండు మ్యాచులే.. తక్కువ సందర్భాల్లో మూడు మ్యాచులున్నాయి..’ అని అన్నాడు.
ఈపీఎల్ వల్ల ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతున్నారని, ముందు వాళ్ల సంగతి చూసుకోవాలని లారెన్స్ కు అశ్విన్ హితబోధ చేశాడు. అంతేగాక.. ఐపీఎల్ షెడ్యూల్ వల్ల అంతర్జాతీయ మ్యాచులకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో తనకు వివరించాలని అశ్విన్ డిమాండ్ చేశాడు. ఐపీఎల్ జరుగుతుండగానే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దేశాలు ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని చెప్పాడు.
ఐపీఎల్ గురించి ఏ కారణం లేకుండా చెడుగా మాట్లాడేవారిపై అశ్విన్ మండిపడ్డాడు. గతంతో పోలిస్తే ఐపీఎల్ భారత్ క్రికెట్ కు మంచే చేసిందని, ఎంతో మంది క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించగలుగుతున్నారని చెప్పాడు. తాను క్రికెట్ ప్రారంభించినప్పుడు కూడా క్రికెట్ తనకు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వగలుగుతుందా..?అని తన తల్లిదండ్రులు అడిగారని, కానీ ఇప్పుడు దాని వల్లే తన కుటుంబం సంతోషంగా గడుపుతుందని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న సుమారు 75 శాతం మంది క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా వచ్చినవాళ్లే అని గుర్తుంచుకోవాలని సూచించాడు.
