మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పై టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మండిపడ్డారు. నీ వాగుడు ఆపు అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంజ్రేకర్ పై జడేజా విరుచుకుపడ్డారు. జడేజా ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం లేకపోలేదు. ఇటీవల మంజ్రేకర్ తనపై చేసిన కామెంట్స్ కి బదులుగానే జడేజా ఇలా స్పందించాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే.... ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓడినప్పటి నుంచి ధోని, రాహుల్‌ సహా కొందరు భారత ఆటగాళ్లను మంజ్రేకర్‌ విమర్శిస్తున్నాడు. అంతేకాకుండా... బంగ్లాదేశ్ తో ఇటీవల భారత్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో జడేజా ఆడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కాగా దీనిపై మంజ్రేకర్ .. జడేజాని కించపరిచేలా మాట్లాడాడు. 

జడేజా అర కొర ఆటగాడు అంటూ వ్యాఖ్యానించాడు. జడేజా టెస్టు క్రికెటర్‌ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్‌ అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా జడేజాను అల్‌రౌండర్‌గా పరిగణించబోనని వ్యాఖ్యానించాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా జడేజా నేడు ట్వీట్‌ చేశాడు.

 ‘నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే రెట్టింపు మ్యాచ్‌లే నేను ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. నేను ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకున్నా. నువ్వు ముందుగా ఏదైనా సాధించినవారిని గుర్తించి గౌరవించడం నేర్చుకో. ఇక నీ చెత్త వాగుడు నేను విన్నది చాలు’ అంటూ సంజయ్‌ మంజ్రేకర్‌ను ట్యాగ్‌ చేస్తూ జడేజా ట్వీట్‌ చేశాడు.