Asianet News TeluguAsianet News Telugu

బోడ గుండు మీద గీకి... వికెట్ల కోసం ఇంగ్లాండ్ తిప్పలు! రావల్పిండి టెస్టులో వికెట్ల కోసం...

పాకిస్తాన్‌తో తొలి టెస్టులో వికెట్ల కోసం తిప్పలు పడుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు... సెంచరీలు బాది అవుటైన పాకిస్తాన్ ఓపెనర్లు! తారు రోడ్డు పిచ్‌పై రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇరుజట్ల బ్యాటర్లు.. 

England vs Pakistan 1st Test: Joe Root shining the ball with the head of Jack Leach
Author
First Published Dec 3, 2022, 12:41 PM IST

రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి క్రికెటర్లు జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో కుదురుకుపోతే వికెట్లు తీయడానికి బౌలర్లు ముప్పుతిప్పలు పడేవాళ్లు. పిచ్ ఎలాంటిదైనా వికెట్ల పతనానికి అడ్డు గోడ కట్టేవాడు ‘ది వాల్’రాహుల్ ద్రావిడ్. అయితే పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రావల్పిండి టెస్టు కథ మాత్రం పూర్తిగా వేరు...

17 ఏళ్ల తర్వాత పాక్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌, స్వదేశంలో తమని ఓడిస్తే పరువు పోతుందనే భయంతో బ్యాటింగ్ పిచ్‌ని రూపొందించింది పాకిస్తాన్. ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా రెండు రోజుల తర్వాత బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించాలి. అయితే రావల్పిండి పిచ్ మాత్రం తారు రోడ్డు కంటే ఘోరంగా...కొట్టుకునేడికి కొట్టుకున్నంత పరుగులు అన్నట్టుగా తయారైంది.. దీంతో బౌలర్లు వికెట్ల కోసం చెమటోడుస్తున్నారు...

ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్లు జాక్ క్రావ్లే, డక్లెట్ సెంచరీలతో తొలి వికెట్‌కి 233 పరుగులు జోడించగా పాక్ ఓపెనర్లు కూడా తామేం తక్కువ తినలేదని, ఫ్లాట్ పిచ్‌పై శతకాలు నమోదు చేసుకున్నారు. అబ్దుల్లా సఫీక్, ఇమామ్ వుల్ హక్ కలిసి తొలి వికెట్‌కి 225 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 203 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసిన అబ్దుల్లా సఫీక్, విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

207 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 పరుగులు చేసిన ఇమామ్ వుల్ హక్, జాక్ లీచ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో నలుగురు ఓపెనర్లు (ఇంగ్లాండ్+ పాకిస్తాన్) సెంచరీలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. 48 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసిన అజర్ ఆలీ, జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

కెప్టెన్ బాబర్ ఆజమ్ 27 పరుగులు చేసి, బ్యాటింగ్ పిచ్‌పై డబుల్ సెంచరీ బాదాలని గట్టి సంకల్పంతో వచ్చినట్టు కనిపిస్తున్నాడు. కరోనాకి ముందు అయితే  వికెట్ల కోసం బంతి షేప్‌ని మార్చేందుకు ఉమ్మిని రుద్దేవాళ్లు. అయితే కరోనా తర్వాత బాల్‌పై ఉమ్మిరాయడాన్ని పూర్తిగా నిషేధించింది ఐసీసీ...

దీంతో బంతి షేప్ మార్చడానికి క్రికెటర్లు వింతవింత పద్ధతులను వెతుకుతున్నారు. కొందరు బంతిని కాలి కింద వేసి తొక్కుతూ షేప్ మార్చడానికి ప్రయత్నిస్తుంటే... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, మరీ వినూత్నంగా ఆలోచించాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌కి నెత్తి మీద జట్టు ఉండదు. బట్ట తల కావడంతో ఎక్కువగా బోడ గుండుతోనే కనిపిస్తాడు జాక్ లీచ్. దీంతో షేప్ మార్చేందుకు జాక్ లీచ్ బోడ గుండుపై జో రూట్ బంతిని రుద్దుతున్న దృశ్యాలు... క్రికెట్ ఫ్యాన్స్‌కి నవ్వులు తెప్పిస్తున్నాయి...

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 101 ఓవర్లలో 657 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టెస్టు క్రికెట్ చరిత్రలో 100 ఓవర్లకు పైగా ఆడి 6.5+ రన్ రేటుతో పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్ర క్రియేట్ చేసింది ఇంగ్లాండ్. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది పాకిస్తాన్. మరీ అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్టు ఫలితం తేలడం కష్టంగానే కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios