లార్డ్స్ టెస్టులో తొలి రోజే హై డ్రామా... తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకి ఆలౌట్ అయిన న్యూజిలాండ్... తొలి రోజే కుప్పకూలిన ఇంగ్లాండ్ టాపార్డర్... 8 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు...
ఐపీఎల్ 2022 సీజన్ సుదీర్ఘ షెడ్యూల్ ముగియడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంగ్లాండ్ టూర్‌లో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడుతోంది. టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, టెస్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు అందుకోవడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజే హై డ్రామా నడిచింది...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 40 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ సూపర్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పాటు ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న మ్యాటీ పాట్స్ ఇద్దరూ పోటీపోటీగా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు కుదురుకోవడానికి కూడా సమయం దొరకలేదు...
ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే విల్ యంగ్‌ని అవుట్ చేసిన జేమ్స్ అండర్సన్, ఆ తర్వాత ఐదో ఓవర్‌లో మరో ఓపెనర్ టామ్ లాథమ్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు.. ఈ ఇద్దరూ కూడా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు...
బీభత్సమైన ఫామ్‌లో ఉన్న డివాన్ కాన్వేని స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేయగా ఈ క్యాచ్ కూడా జానీ బెయిర్ స్టోనే అందుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియంసన్ 22 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసి కొత్త కుర్రాడు మ్యాటీ ప్యాట్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు...
35 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన డార్ల్ మిచెల్, 39 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన టామ్ బ్లండెల్ ఇద్దరూ కూడా మ్యాటీ ప్యాట్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కేల్ జెమ్మీసన్ 6, టిమ్ సౌథీ 23 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో మ్యాటీ ప్యాట్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు...
అజాజ్ పటేల్‌ని మ్యాటీ ప్యాట్స్ అవుట్ చేయగా ట్రెంట్ బౌల్ట్ 16 బంతుల్లో 14 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. బౌలింగ్‌లో ఇరగదీసి ప్రత్యర్థిని 132 పరుగులకే అవుట్ చేశామన్న ఆనందం ఇంగ్లాండ్‌కి ఎక్కువ సేపు నిలవలేదు.
ఓపెనర్లు జాక్ క్రావ్లే, అలెక్స్ లీస్ కలిసి తొలి వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 56 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన జాక్ క్రావ్లే, జెమ్మీసన్ బౌలింగ్‌లో అవుట్ కాగా 7 పరుగులు చేసిన ఓల్లీ పోప్ కూడా అతని బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...
గత ఏడాది సెంచరీల మోత మోగించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 15 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 77 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన అలెక్స్ లీస్‌ని టిమ్ సౌథీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు.
బెన్ స్టోక్స్ 1, జానీ బెయిర్ స్టో 1 పరుగు చేసి అవుట్ కాగా మ్యాట్ ప్యాట్స్ డకౌట్ అయ్యాడు. ఒకానొక దశలో 92/2 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, 8 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 100/7 స్కోరుకి చేరుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసిన ఇంగ్లాండ్, కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 16 పరుగులు వెనకబడి ఉంది.
కెప్టెన్ మారినా, హెడ్ కోచ్‌ని మార్చినా ఇంగ్లాండ్ ఆటతీరులో మాత్రం మార్పు రాలేదని అంటున్నారు ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్స్. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మీద నమ్మకం లేకనే లార్డ్స్ టెస్టు కోసం ఇలాంటి నాసిరకం పిచ్‌ని తయారు చేసి ఉంటారని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుని ట్రోల్ చేస్తున్నారు...
