లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన ఇంగ్లాండ్...  తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి 104 పరుగుల ఆధిక్యం...

హెడ్డింగ్‌లే టెస్టులో టీమిండియా పట్టు కోల్పోయేదిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 120/0 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్, లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కి 104 పరుగుల ఆధిక్యం దక్కింది...

తొలి వికెట్‌కి 135 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత రోరీ బర్న్స్ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 153 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను మహ్మద్ షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 195 బంతుల్లో 12 ఫోర్లతో 68 పరుగులు చేసిన హసీబ్ హమీద్‌ను రవీంద్ర జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాని 78 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, ఎంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతోంది. ఇంగ్లాండ్ కోల్పోయిన రెండు వికెట్లు కూడా బౌల్డ్ ద్వారానే కావడం విశేషం. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన డేవిడ్ మలాన్ 49 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేయగా, జో రూట్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు..