Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ టీమ్‌కి దెబ్బ మీద దెబ్బ... గబ్బా పరాజయం మరవకముందే వేటు వేసిన ఐసీసీ...

గబ్బా టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా ఇంగ్లాండ్ జట్టుకి 100 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ... అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 లీగ్ పాయింట్లలోనూ ఐదు పెనాల్టీ పాయింట్లు...

England team fined 100 percent match fee and deducted five point of ICC WTC after gabba test
Author
India, First Published Dec 11, 2021, 3:55 PM IST

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని మరో దెబ్బ తగిలింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుపై భారీ జరిమానాతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లీగ్‌లో ఐదు పాయింట్లను కోత విధించింది ఐసీసీ...

ఐసీసీ నిబంధన 16.11.2 రూల్ ప్రకారం గంటకు ఐదు ఓవర్లు తక్కువగా వేసిన ఇంగ్లాండ్‌కి ఐదు పాయింట్లు కోత విధించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఇంగ్లాండ్ ప్లేయర్లకు 100 శాతం కోత విధించింది. అంతే బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ ఆడిన ఏ ఇంగ్లాండ్ ప్లేయర్‌కి మ్యాచ్ ఫీజుగా ఒక్క రూపాయి కూడా అందదు...

Read: గ్రెగ్ ఛాపెల్, రవిశాస్త్రిని పిలిచి ఆ విషయం అడిగాడు... అది చేయడంలో ఆయన రూటే వేరు...

అలాగే మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కి కూడా 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. ఇప్పటికే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్, 7 పెనాల్టీ పాయింట్లను ఖాతాలో వేసుకుంది.

ఇంతకుముందు ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన సిరీస్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టుకు 2 పాయింట్లు, ఇంగ్లాండ్ టీమ్‌కి 2 పెనాల్టీ పాయింట్లు కోత విధించింది ఐసీసీ. శ్రీలంక 2 మ్యాచుల్లో 2 విజయాలు అందుకుని, 100 శాతం విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది...

తొలి టెస్టులో గెలిచి, 100 శాతం విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానానికి ఎగబాకగా, పాకిస్తాన్ జట్టు 4 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుని 75 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఆరు మ్యాచుల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో పాటు రెండు మ్యాచులను డ్రా చేసుకున్న టీమిండియా 58.33 శాతం విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది...

కాన్పూర్ టెస్టులో ఒకే ఒక్క వికెట్ తీయలేక డ్రాగా ముగించిన భారత జట్టు, ఆ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుని ఉంటే, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి ఉండేది. వెస్టిండీస్ నాలుగు మ్యాచుల్లో మూడు పరాజయాలు, ఓ విజయంతో ఐదో స్థానంలో ఉంది...

ఇండియా టూర్‌లో ఓ టెస్టును డ్రా చేసుకుని, ఓ మ్యాచ్‌లో ఓడిన న్యూజిలాండ్ జట్టు 16 శాతం విజయాలతో ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటిదాకా ఆడిన రెండు టెస్టుల్లోనూ పాక్ చేతుల్లో ఓడింది...

ఏడో స్థానంలో ఏడు పెనాల్టీ పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, టాప్ 2లోకి చేరాలంటే ఇకపై అద్భుత విజయాలతో జైత్రయాత్ర మొదలెట్టాల్సి ఉంటుంది. లేదంటే మున్ముందు ఇంగ్లాండ్ జట్టు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 

Read Also: అలాంటి టీమ్‌ దొరికితే ఎవ్వరైనా టైటిల్స్ గెలుస్తారు... ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కామెంట్స్...

అలాగే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడానికి కారణమైన ట్రావిస్ హెడ్‌కి ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం 15 శాతం మ్యాచ్ ఫీజును కోత విధించింది ఐసీసీ. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బంతి, ట్రావిస్ హెడ్‌కి బలంగా తగిలింది. దీంతో హెడ్, బెన్ స్టోక్స్‌ను బూతులు తిట్టాడు. ఈ మాటలు స్టంప్ కెమెరాలో రికార్డు కావడంతో ట్రావిడ్ హెడ్ తన తప్పును అంగీకరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios