వీడెక్కడ దొరికాడ్రా బాబూ... మరోసారి భారత జెర్సీలో క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో...
మరోసారి భారత జెర్సీలో క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో... సోషల్ మీడియాలో వీడియోలు వైరల్, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు...
రెండో టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత జెర్సీలో క్రీజులోకి దూసుకొచ్చి హడావుడి చేశాడు ఓ ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్ జార్వో. తాను భారత ప్లేయర్‌ని అంటూ, బీసీసీఐ లోగో చూపిస్తూ... సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది...
మూడో టెస్టులో క్రీజులో ప్రత్యేక్షమయ్యాడు జార్వో. రోహిత్ శర్మ అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాటు పట్టుకుని నెం.4 బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి వచ్చేశాడు జార్వో. అతను బ్యాటింగ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్రీజులోకి వచ్చింది విరాట్ కోహ్లీ కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, అతన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు...
సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో జార్వో ఎంట్రీ, మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త వినోదాన్ని పంచింది. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం, అందరికీ నవ్వులు పూయిస్తోంది.
అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓ అభిమాని, ఇలా రెండు సార్లు క్రీజులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే అభిమాని, రెండుసార్లు సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడంటే, మరేవరైనా వస్తే ప్లేయర్ల రక్షణకి గ్యారెంటీ ఏంటని నిలదీస్తున్నారు అభిమానులు...