సారాంశం
ENG vs IRE: ప్రఖ్యాత క్రికెట్ గ్రౌండ్ లార్డ్స్ వేదికగా ఐర్లాండ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ చెలరేగి ఆడుతోంది. ఐర్లాండ్‌కు బజ్‌బాల్ రుచి చూపిస్తోంది.
ఇంగ్లాండ్ తో ఏకైక టెస్టు ఆడేందుకు ఆ దేశానికి వచ్చిన ఐర్లాండ్‌కు బెన్ స్టోక్స్ సేన ‘బజ్‌బాల్’ రుచి చూపిస్తోంది. తొలుత బౌలింగ్ లో ఐర్లాండ్ ను ఆటాడుకున్న ఇంగ్లాండ్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా దుమ్ముదులిపింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ తో పాటు యువ సంచలనం ఓలీ పోప్‌ల వీరవిహారంతో ఈ టెస్టులో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆడుతున్నది టెస్టా లేక టీ20నా అన్నచందంగా ఈ ఇద్దరూ వీరబాదుడు బాదారు.
తొలిరోజు ఐర్లాండ్‌ను 172 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లీష్ జట్టు..అదే రోజు బ్యాటింగ్ కు వచ్చింది. ఎప్పట్లాగే ఓపెనర్లు జాక్ క్రాలే (45 బంతుల్లో 56, 11 ఫోర్లు) , బెన్ డకెట్ (178 బంతుల్లో 182, 24 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 109 పరుగులు జోడించారు.
క్రాలే నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ (208 బంతుల్లో 205, 22 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఐర్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ ఇద్దరి బాదుడుకు ఐర్లాండ్ ఫీల్డర్లు బౌండరీకి వెళ్లి బంతిని బౌలర్ కు అందివ్వడం మినహా చేయగలిగిందేమీ లేదు అన్నంతగా విధ్వంసం సాగింది. రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ 252 పరుగులు జోడించారు. డకెట్ నిష్క్రమించిన తర్వాత పోప్.. జో రూట్ (59 బంతుల్లో 56, 4 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి రెచ్చిపోయాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 146 పరుగులు జోడించారు. డబుల్ సెంచరీ తర్వాత పోప్ ఔట్ అయ్యాడు. జో రూట్ కూడా నిష్క్రమించడంతో బెన్ స్టోక్స్.. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.
రెండో ఇన్నింగ్స్ లో 352 పరుగులు వెనుకబడ్డ ఐర్లాండ్.. రెండో రోజు చివరి సెషన్ లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పీటర్ మోర్ (11) విఫలమవగా జేమ్స్ మెక్ కొల్లమ్ (1) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఆండ్రూ బల్బ్రైన (2) తో పాటు పాల్ స్టిర్లింగ్ (15) కూడా నిష్క్రమించారు. ఈ మూడు వికెట్లూ జోష్ టంగ్ కే దక్కాయి. హ్యారీ టెక్టర్ (33 నాటౌట్), లోర్కన్ టక్కర్ (21 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఐర్లాండ్.. 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఇంకా 255 పరుగులు వెనుకబడి ఉన్న ఐర్లాండ్.. మూడో రోజు మొత్తం బ్యాటింగ్ చేసినా గొప్పే. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడం మినహా ఈ టెస్టులో ఐర్లాండ్ చేయగలిగేదేమీ లేదు..!