Asianet News TeluguAsianet News Telugu

22 ఏండ్ల తర్వాత పా‌క్‌లో ఇంగ్లాండ్‌కు టెస్టు సిరీస్ విజయం.. మళ్లీ విజయం ముంగిట బొక్క బోర్ల పడ్డ బాబర్ సేన

PAKvsENG 2nd Test: అదే ఉత్కంఠ. అదే  టెన్షన్.  ప్రతీ బంతికీ  ఏమవుతుందోననే  ఆసక్తి. విజయం రెండు జట్ల మధ్య దోబూచూలాడినా చివరికి ఇంగ్లీష్ జట్టే విజేతగా నిలిచింది.  22 ఏండ్ల తర్వాత  పాకిస్తాన్ లో టెస్టు సిరీస్ గెలుచుకుంది. 

England Scripts History in In Multan, Beat Pakistan by 26 Runs in Multan Test
Author
First Published Dec 12, 2022, 2:50 PM IST

‘ట్విస్టులు..  ఝలక్‌లు.. దెబ్బమీద దెబ్బ..  ప్రతీ సీన్ ఓ క్లైమాక్స్ లా ఉంటది..’ అంటాడు దేశముదురు సినిమాలో అలీ తన గురించి చెబుతూ.. పూరీ జగన్నాథ్ కూడా ఆ సీన్స్ ను అంత ఆసక్తిగా రాయడమే గాక  తీసి శెభాష్ అనిపించుకున్నాడు.  సరిగ్గా పాకిస్తాన్ - ఇంగ్లాండ్  మధ్య ముల్తాన్ వేదికగా ముగిసిన రెండో టెస్టు చూసినవారికి కూడా ఇదే డైలాగ్ గుర్తురాక మానదు.  రావల్పిండిలో మాదిరిగానే  చివరివరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.   ఓవర్ ఓవర్ కూ ఆధిపత్యం చేతులు మారింది. ఇక మాదే విజయం అని పాకిస్తాన్, ఇంగ్లాండ్ లు అనుకున్నాయి.  కానీ చివరికి  ముల్తాన్ కా సుల్తాన్ అయ్యింది మాత్రం  ఇంగ్లీష్ జట్టే. 

ముల్తాన్ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టులో  బెన్ స్టోక్స్ సారథ్యంలోని  ఇంగ్లీష్ జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది.  355 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్..  328 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా  26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జయభేరి మోగించి మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో గెలుచుకుంది.  పాకిస్తాన్ లో ఇంగ్లాండ్ కు 22 ఏండ్ల తర్వాత ఇదే తొలి సిరీస్ విజయం.  ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా  2000 సంవత్సరంలో నాసిర్ హుస్సేన్ సారథ్యంలో  టెస్టు సిరీస్ నెగ్గింది. 

17 ఏండ్ల తర్వాత  పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. రావల్పిండిలో ముగిసిన తొలిటెస్టును గెలుచుకున్న విషయం తెలిసిందే.  ఆ మ్యాచ్ తర్వాత ముల్తాన్ లో కూడా అదే ఆటతీరుతో పాక్ కు చుక్కలు చూపించింది. రావల్పిండిలో  ఫ్లాట్ పిచ్ తయారుచేసి ఫలితం  తేలకుండా పాక్ పన్నాగం పన్నినా  ఇంగ్లాండ్ దూకుడైన ఆటతో చివరి బంతి వరకూ పోరాడి ఆ మ్యాచ్ ను గెలుచుకుంది. దీంతో ముల్తాన్ లో ఎలాగైనా గెలవాలని  పీసీబీ ఈసారి స్పిన్ పిచ్ ను తయారుచేయించి ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించాలని చూసింది.  ఆ విషయంలో  సక్సెస్ కూడా అయింది. 

కొత్త కుర్రాడు అబ్రర్ అహ్మద్  తొలి ఇన్నింగ్స్ లో పాక్ ను కకావికలం చేశాడు.   మొదటి ఇన్నింగ్స్ లో  ఇంగ్లాండ్ 281 పరుగులకు ఆలౌటైంది. అబ్రర్ కు ఏడు వికెట్లు పడ్డాయి.  బదులుగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులకు  ఆలౌటైంది.   జాక్ లీచ్ తో పాటు  జో రూట్ లు పాకిస్తాన్ కు షాకులిచ్చారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. హ్యారీ బ్రూక్ సెంచరీ చేయడంతో 275 పరుగుల చేసి పాకిస్తాన్ ఎదుట 355 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

లక్ష్య ఛేదనలో పాక్.. మూడో రోజు పాకిస్తాన్  ధీటుగానే బదులిచ్చింది.   మూడో రోజు ఆట ముగిసేసరికి పాక్.. 64  ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్  (60) తో కలిసి  మూడో రోజు పోరాడిన సౌద్ షకీల్.. (213 బంతుల్లో 94) పాక్ ను ఓటమి నుంచి తప్పించడానికి విశ్వప్రయత్నం చేశాడు.   అతడికి తోడుగా మహ్మద్ నవాజ్ (45), అగా సల్మాన్ (20), అబ్రర్ అహ్మద్ (17) లు కాస్త  సాయం అందించారు.  కానీ  స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఇంగ్లాండ్ పేసర్లు అండర్సన్, మార్క్ వుడ్, రాబిన్సన్ లు పేస్ ను రాబట్టి  పాకిస్తాన్ ను దెబ్బతీశారు.  లంచ్ వరకు  అంతో ఇంతో పోరాడిన పాకిస్తాన్.. తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది.  

 

నాలుగు ఫోర్లు బాదిన అబ్రర్ ను అండర్సన్ ఔట్  చేశాడు. తర్వాత జహీద్ మహ్మద్ (0) ను మార్క్ వుడ్ ఔట్ చేయగా మహ్మద్ అలీ (0) ని రాబిన్సన్ పెవిలియన్ కు పంపి  పాక్ ఇన్నింగ్స్ కు  ఎండ్ కార్డ్ వేశాడు. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ కు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు  ఈనెల 17 నుంచి  కరాచీ వేదికగా జరగాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios