ఐపీఎల్ ఫ్రాంఛైజీలందు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది వేరే కథ. భారీ క్రేజ్, బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ఆర్‌సీబీ, ప్రతీ యేటా ‘ఈ సాల్ కప్ నమ్‌దే’ అంటూ హడావుడిగా సీజన్‌ను ఆరంభిస్తుంది, సీజన్ ముగిసేసరికి నిరాశజనిత ప్రదర్శనతో టైటిల్ గెలవకుండానే  వైదొలుగుతుంది.

13 సీజన్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆర్‌సీబీ జట్టులో ప్లేస్ కావడంలో ఓ స్టార్ ప్లేయర్ కోరాడు. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ హ్యారీ కేన్... విరాట్ కోహ్లీకి వీరాభిమాని. గత ఏడాది 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో విరాట్ కోహ్లీని కలిసిన కేన్, అతనితో చాలాసేపు ముచ్చటించాడు. తాజాగా తన ఫుట్‌బాల్ టీమ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్టు చేశాడు హ్యారీ కేన్.

‘మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాను. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో నీ జట్టులో నాకు ప్లేస్ ఉంటుందా... విరాట్’ అంటూ తన బ్యాటింగ్ వీడియోను పోస్టు చేశాడు హ్యారీ కేన్. ఈ వీడియోపై స్పందించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ‘జెర్సీ నెం. 1010 ఇస్తాం’ అంటూ సమాధానమిచ్చింది.

దీనికి ‘డీల్... త్వరలో దాన్ని ధరించడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, ‘అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవ్వరు’ అంటూ ప్రశ్నించాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.