రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బ్రాడ్... యాషెస్ సిరీస్‌లో ఐదో టెస్టుతోనే 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి..
37 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బ్రాడ్... ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచే ఆఖరిదంటూ ప్రకటన...

ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అప్పుడెప్పుడో 2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్, 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు.. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌తో కలిసి దశాబ్దానికి పైగా బంతి పంచుకుంటూ వచ్చిన స్టువర్ట్ బ్రాడ్... తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించాడు. స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ ఇద్దరూ కలిసి 1002 వికెట్లు తీయడం రికార్డు..
ఇంగ్లాండ్ తరుపున 121 వన్డేలు, 56 టీ20 మ్యాచులు ఆడిన స్టువర్ట్ బ్రాడ్, కొన్నేళ్లుగా టెస్టులకు మాత్రమే పరిమితం అయ్యాడు. 165 టెస్టులు ఆడిన స్టువర్ట్ బ్రాడ్, ప్రస్తుతం యాషెస్ సిరీస్ 2023 టోర్నీలో పాల్గొంటున్నాడు. 5 టెస్టుల్లో 20 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం కెన్నింగ్టన్ ఓవల్‌లో ఐదో టెస్టు ఆడుతోంది ఇంగ్లాండ్. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై 377 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బ్రాడ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు..
నాలుగో రోజు బ్యాటింగ్‌లో ఆఖరి ఇన్నింగ్స్ ఆడబోతున్నట్టు ప్రకటించాడు స్టువర్ట్ బ్రాడ్. ‘రేపు, లేదా సోమవారం, నా క్రికెట్‌కి ఆఖరి రోజు. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. నాటింగ్‌హమ్, ఇంగ్లాండ్ తరుపున ఆడడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను క్రికెట్‌ని ఎంతగానే ప్రేమించాడు. ఈ సిరీస్ చాలా అద్భుతంగా సాగింది. ఎప్పుడూ టాప్‌లో ముగించాలని కోరుకున్నా. ఈ సిరీస్‌లో నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది...’ అంటూ తెలియచేశాడు స్టువర్ట్ బ్రాడ్..
2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్, ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. యువీ ఈ ఫీట్ సాధించడానికి ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన సెడ్జింగ్ కారణం. ఈ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్, కొన్ని వన్డేలకు, టీ20లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2010 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్న స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్‌గా ఉన్నాడు..
ఇంగ్లాండ్ తరుపున 182 మ్యాచులు ఆడిన జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్‌గా టాప్‌లో ఉంటే, స్టువర్ట్ బ్రాడ్ 166 టెస్టులు ఆడాడు. జేమ్స్ అండర్స్ 689 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా టాప్‌లో ఉంటే, 600 వికెట్లు పూర్తి చేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. రెండో స్థానంలో ఉన్నాడు..
2015 యాషెస్ సిరీస్‌లో 15 పరుగులకే 8 వికెట్లు పడగొట్టిన స్టువర్ట్ బ్రాడ్, కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. బ్రాడ్ సూపర్ స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా ఆ ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది..
టెస్టుల్లో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో 3640 పరుగులు చేసిన స్టువర్ట్ బ్రాడ్, పాకిస్తాన్‌పై టెస్టులో 169 పరుగులు చేశాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 260 మ్యాచులు ఆడి 930 వికెట్లు తీశాడు. డేవిడ్ వార్నర్‌ని 17 సార్లు అవుట్ చేసిన స్టువర్ట్ బ్రాడ్, టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.