వచ్చేనెలలో ప్రపంచ దేశాల మధ్య క్రికెట్ సమరం  ప్రారంభంకానుంది. ఇప్పటికే ఐసిసి వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని దేశాలు సిద్దమయ్యాయి. ఆతిథ్య ఇంగ్లాండ్ అయితే నెల రోజుల ముందే ప్రపంచకప్ జట్టులో ఎంపికైన ఆటగాళ్లను సన్నద్దం చేసే పనిలో పడింది. ఇందుకోసం ఐపిఎల్ లో ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్ళు స్వదేశానికి తరలిపోయారు. ఇలా స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఎలాగైనా నెగ్గి  ఆ ట్రోపిని ముద్దాడాలని చూస్తున్న ఇంగ్లాండ్ తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

ఇంగ్లాండ్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న కీలక ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. దేశీయంగా జరిగే ఓ క్రికెట్ టోర్నీలో ఆడుతూ అంతర్జాతీయ ఆటగాడు శామ్ బిల్లింగ్స్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కుడి భుజానికి తీవ్రంగా గాయమవడంతో ఆ టోర్నీ నుండి తప్పుకున్నాడు. అయితే గాయం తీవ్రత అధికంగా వుండటంతో శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.  

ఈ ఆపరేషన్ తర్వాత అతడు కోలుకోడానికి దాదాపు ఐదు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో బిల్లింగ్స్ పాకిస్థాన్ తో జరిగే టీ20 సీరిస్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో  వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌ ఇంగ్లాండ్ జట్టులో చేరాడు. 

అలాగే ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని కూడా అతడు కోల్పోయాడు. వచ్చే నెలలోనే ప్రపంచ కప్ టోర్నీ జరగనున్న నేపథ్యంలో అప్పటివరకు కూడా బిల్లింగ్స్ కోలుకునే అవకాశం లేదు. కాబట్టి  వరల్డ్ కప్ నుండి కూడా నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.