England World Record Score in ODIs: నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన  ఇంగ్లీష్ జట్టు  ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. 

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు వన్డేలలో రికార్డు స్కోరు నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అమ్స్టెల్వీన్ లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్ లో గతంలో తన పేరిట ఉన్న అత్యధిక స్కోరు (481) రికార్డును తుడిపేసింది. ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు గనక చేసిఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో 500 పరుగులు చేసిన తొలి  క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించేది. 

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరుగుతున్న తొలి వన్డే లో టాస్ ఓడి బ్యాటింగ్ కు  వచ్చిన ఇంగ్లాండ్ జట్టు.. పసికూన నెదర్లాండ్ కు చుక్కలు చూపెట్టింది. ఆ జట్టులో  ఫిలిప్ సాల్ట్, మలన్, జోస్ బట్లర్ లు సెంచరీలు చేశారు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (1) వికెట్ ను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో నెదర్లాండ్ అదొక్కటే గుడ్ న్యూస్. ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాటర్లు వరుస పెట్టి సెంచరీలు బాదారు. ఫిలిప్ సాల్ట్ (93 బంతుల్లో 122.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (70 బంతుల్లో 162 నాటౌట్.. 7 ఫోర్లు, 14 సిక్సర్లు) ఐపీఎల్ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. 

 

Scroll to load tweet…

ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి నెదర్లాండ్ బౌలర్లు  భారీగా పరుగులిచ్చుకున్నారు. ఫిలిప్ బొయ్సెవేన్ 10 ఓవర్లలో 108 పరుగులిచ్చాడు. బాస్ డి లీడె.. 5 ఓవర్లలో 65.. స్నాటర్ 10 ఓవర్లలో 99.. సీలర్ 9 ఓవర్లలో 83 పరుగులు సమర్పించుకున్నారు. కాగా..  ఈ మ్యాచ్ లో 12 ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్.. ఒక వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. 

వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోర్లు : 

- ఇంగ్లాండ్: 498-4  (నెదర్లాండ్స్-2022) 
- ఇంగ్లాండ్: 481-6 (ఆస్ట్రేలియా-2018) 
- ఇంగ్లాండ్: 444-3 (పాకిస్తాన్ - 2016)
- శ్రీలంక: 443-9 (నెదర్లాండ్స్ - 2006) 
- సౌతాఫ్రికా: 439-2 (వెస్టిండీస్ - 2015)
- సౌతాఫ్రికా: 438-9 (ఆస్ట్రేలియా-2006) 
పై జాబితాలో టాప్-3 లో ఇంగ్లీష్ జట్టే ఉండటం గమనార్హం. 

 

Scroll to load tweet…