యాషెస్ సీరిస్ లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు కేవలం ఆటలోనే కాదు మాటల్లోనూ పోటీపడుతున్నాయి. ముఖ్యంగా మొదటి టెస్ట్ లో వరుస సెంచరీలతో జట్టును గెలిపించిన స్టీవ్ స్మిత్, మూడో టెస్ట్ లో 8 వికట్లు పడగొట్టిన జోఫ్రా ఆర్చర్ మధ్య మాటలయుద్దం సాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వీరిమధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు సాగుతున్నాయి. 

రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ నిప్పులుచెరిగే బంతులను ఎదుర్కోవడంలో స్మిత్ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే ఓ బంతి అతన్ని తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. దీంతో స్మిత్ ఆ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ తో పాటు మూడో టెస్ట్ మొత్తానికి దూరమయ్యాడు. స్మిత్ లేకుండా మూడో టెస్ట్ లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓటమిపాలయ్యింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ కోసం సిద్దమవుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ముందుగా మాటల యుద్దాన్ని ప్రారంభించారు. 

'' ఆర్చర్ అంత గొప్ప బౌలరేమీ కాదు. అతడు నన్ను గాయపర్చాడు కానీ వికెట్ పడగొట్టలేకపోయాడు. ,చాలా మంది  ఇంగ్లీష్ బౌలర్లు నన్ను ఔట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆర్చర్ ఇంకా ఆ స్థాయికి చేరుకకోలేదు. '' అంటూ స్మిత్ ముందుగా సెటైర్లు వేశాడు. 

స్మిత్ తనపై చేసిన కామెంట్స్ ను అదే  స్థాయిలో తిప్పికొట్టాడు ఆర్చర్. '' కేవలం నీ ఒక్కడి వికెట్ కోసమే నేను క్రికెటర్ కాలేదు. అయినా నిన్ను ఔట్ చేయడానికి నాకింకా చాలా సమయం వుంది. ఇప్పుడు కేవలం మా దేశానికి యాషెస్ సీరిస్ ను సాధించిపెట్టడమే నా లక్ష్యం. ఆ క్రమంలో నిన్నే కాదు ఎవరినైనా ఔట్ చేయగలనన్న నమ్మకం  నాకుంది. 

నువ్వు గాయాలతో మ్యాచులకు దూరమైతే నేనెలా ఔట్  చేయగలను. కనీసం రెండో టెస్ట్ లో ఓ ఇన్నింగ్స్ అయినా ఆడావు...మూడో టెస్ట్ కు అయితే పూర్తిగా దూరమయ్యావు. ఆ మ్యాచ్ లో ఆడివుంటే ఎవరి సత్తా ఏంటో తేలిపోయేది. ఈ టెస్ట్ లో నేను ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఐదు, సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టిన విషయాన్ని  గుర్తుంచుకో. '' అంటూ ఆర్చర్ కూడా సీరియస్ కామెంట్స్ చేశాడు.