ENG vs NZ 1st Test: ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జయకేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ గా ఇటీవలే నియమితుడైన బెన్ స్టోక్స్ తొలి మ్యాచ్ తోనే విక్టరీ కొట్టాడు. ఈ మ్యాచ్ లో జో రూట్ సెంచరీతో కదం తొక్కాడు. సెంచరీ చేయగానే అతడు పలు ఘనతలు అందుకున్నాడు.

కొద్దిరోజులుగా వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లాండ్ కు టెస్టులలో విజయం దక్కింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 5 వికెట్ల తేడాతో కివీస్ ను ఓడించి సిరీస్ లో బోణీ కొట్టింది. టెస్టులలో కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ లు విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి రెండు రోజులు బౌలర్లకు సహకరించిన లార్డ్స్.. తర్వాత బ్యాటర్లకు అనుకూలించింది. కెప్టెన్సీ పోయినా రూట్ మాత్రం.. తన బ్యాటింగ్ విన్యాసాలతో బెన్ స్టోక్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. 

277 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 69 కే 4 కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో జో రూట్ (170 బంతుల్లో 115 నాటౌట్.. 12 ఫోర్లు), బెన్ స్టోక్స్ (54) లు ఆ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 90 పరుగులు జోడించారు. అయితే స్టోక్స్ ను జెమీసన్ ఔట్ చేసినా బెన్ ఫోక్స్ (92 బంతుల్లో 32 నాటౌట్. 3 ఫోర్లు) సాయంతో దు రూట్ ఇంగ్లాండ్ ను విజయతీరాలకు నడిపించాడు. రూట్-ఫోక్స్ ఆరో వికెట్ కు 110 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లలో జెమీసన్ నాలుగు వికెట్లు తీశాడు. 

జో రూట్ అరుదైన ఘనత.. 

గత కొంతకాలంగా తన కెప్టెన్సీ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే ఆ పగ్గాలు వదిలిపెట్టిన రూట్.. ఈ టెస్టులో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతడు సెంచరీ చేయగానే అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్ లో టెస్టులలో పదివేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో సర్ అలెస్టర్ కుక్ (12,472) ఉన్నాడు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా పదివేల టెస్టు పరుగులు పూర్తి చేసిన 14వ ఆటగాడు రూట్. అతడికి ఇది 26వ సెంచరీ కావడం విశేషం. అదీగాక నాలుగో ఇన్నింగ్స్ లో ఆడుతూ సెంచరీ చేయడం రూట్ కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

Scroll to load tweet…

సంక్షిప్త స్కోరు : 
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 132 ఆలౌట్ 
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 141 ఆలౌట్ 
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 285 ఆలౌట్ 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 279-5 
ఫలితం : ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం 

Scroll to load tweet…