Asianet News TeluguAsianet News Telugu

ఐర్లాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. టెస్టు క్రికెట్ చరిత్రలో బెన్ స్టోక్స్ అరుదైన ఘనత

ENG vs IRE: ఇంగ్లాండ్ పర్యటనలో ఏకైక టెస్టు ఆడేందుకు వచ్చిన ఐర్లాండ్‌కు ఇంగ్లీష్ జట్టు  చుక్కలు చూపించి మూడు రోజుల్లోనే  మ్యాచ్‌ను ముగించింది. 

England Beat Ireland By 10 Wickets in Lords, English Skipper Ben Stokes Creates this Rare Record MSV
Author
First Published Jun 4, 2023, 10:02 AM IST

ఏడాదికాలంగా ‘బజ్‌బాల్’ అప్రోచ్‌తో టెస్టు క్రికెట్ రూపురేఖలను మార్చేస్తున్న  ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. పసికూన  ఐర్లాండ్‌కు చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ తో ఒక టెస్టు ఆడేందుకు గాను ఆ దేశ  పర్యటనకు వచ్చిన ఐర్లాండ్.. బెన్ స్టోక్స్  బజ్‌బాల్ ధాటికి అతలాకుతలమైంది.  బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన ఇంగ్లాండ్.. పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ప్రఖ్యాత స్టేడియం లార్డ్స్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో ఫస్ట్  ఇన్నింగ్స్ లో బ్యాటింగ్  చేసిన ఐర్లాండ్‌ను 172 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లీష్ జట్టు..అదే రోజు  బ్యాటింగ్ కు వచ్చింది.  ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే  (45 బంతుల్లో 56, 11 ఫోర్లు) , బెన్ డకెట్ (178 బంతుల్లో 182, 24 ఫోర్లు, 1 సిక్స్)  లు ధాటిగా ఆడారు. 

ఈ ఇద్దరితో పాటు  ఓలీ పోప్ (208 బంతుల్లో 205, 22 ఫోర్లు, 3 సిక్సర్లు)  డబుల్ సెంచరీ చేశాడు. జో రూట్  (59 బంతుల్లో  56, 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో  తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్  524 పరుగుల భారీ స్కోరు చేసింది.  అనంతరం  రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.   162 పరుగులకే ఆ జట్టు ఏకంగా  ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ క్రమంలో   లోయరార్డర్ బ్యాటర్లు అండి మెక్‌బ్రైన్ (86), మార్క్ అడైర్ (88) లు అద్భుతంగా పోరాడి  ఐర్లాండ్ కు ఇన్నింగ్స్ ఓటమి నుంచి  విముక్తి కల్పించారు.  అయితే ఈ ఇద్దరూ నిష్క్రమించాక  ఐర్లాండ్ ఇన్నింగ్స్.. 362 పరుగలకు  ముగిసింది. 

10 పరుగుల లక్ష్యాన్ని  ఇంగ్లాండ్ నాలుగు బంతుల్లో ఊదేసింది. జాక్ క్రాలే.. 3 బౌండరీలు కొట్టి ఇంగ్లాండ్  విజయాన్ని ఖాయం చేశాడు. 

 

స్టోక్స్ అరుదైన ఘనత.. 

కాగా  లార్డ్స్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ టెస్టు   క్రికెట్ చరిత్రలో మరే  కెప్టెన్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.   స్టోక్స్ ఈ మ్యాచ్ లో  బౌలింగ్, బ్యాటింగ్ చేయకుండానే  విజయాన్ని అందుకున్నాడు. టెస్టు క్రికెట్  చరిత్రలో ఒక కెప్టెన్ బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్  చేయకుండా టెస్టు గెలిచిన   సారథిగా  అరుదైన ఘనతను అందుకున్నాడు.  నేడు (జూన్ 04) స్టోక్స్ బర్త్ డే జరుపుకుంటున్న  స్టోక్స్‌ కు ఈ  విజయం మరింత  ఆనందాన్నిచ్చింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios