AUS vs ENG T20I: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పెర్త్ వేదికగా ముగిసిన తొలి టీ20లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి 40 ఓవర్లలో 400 పరుగులకు పైగా నమోదు చేశాయి. ఇరుజట్ల మధ్య ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ నే విజయం వరించింది.
టీ20 ప్రపంచకప్ కు ముందు రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీ క్రికెట్ అభిమానులకు వీనుల విందుగా మారింది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పెర్త్ వేదికగా ముగిసిన తొలి టీ20లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి 40 ఓవర్లలో 400 పరుగులకు పైగా నమోదు చేశాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. బట్లర్ (68), హేల్స్ (84) వీరబాదుడు బాదారు. అనంతరం ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్.. 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73, 8ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఈనెల 12న జరుగుతుంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కు తొలుత బ్యాటింగ్ కు అప్పజెప్పింది. కానీ ఫించ్ నిర్ణయం తప్పని నిరూపిస్తూ ఇంగ్లీష్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఐపీఎల్-15 నుంచి అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ మరోసారి రెచ్చిపోయాడు. 32 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు.
బట్లర్ కు తోడుగా మరో ఓపెనర్ హేల్స్ కూడా రెచ్చిపోయి ఆడాడు. హేల్స్.. 51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 11.1 ఓవర్లలోనే ఏకంగా 132 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించడం ఖాయమని భావించిన ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. బట్లర్ నిష్క్రమించాక ఆ జట్టు బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. బెన్ స్టోక్స్ (9), హ్యరీ బ్రూక్ (12), మోయిన్ అలీ (10), సామ్ కరన్ (2), మలన్ (2) లు విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది.
209 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు రెండో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (1) విండీస్ సిరీస్ లో మాదిరే మరోసారి విఫలమయ్యాడు. కానీ మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి డేవిడ్ వార్నర్ ఆసీస్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 71 పరుగులు జోడించారు. కానీ అదిల్ రషీద్ ఈ జోడీని విడదీశాడు. రషీద్ వేసిన 8 ఓవర్లో మూడో బంతికి మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ (12) నిరాశపరచగా మార్కస్ స్టోయినిస్ (15 బంతుల్లో 35, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఉన్నదికాసేపే అయినా దూకుడుగా ఆడాడు. కానీ ఒకే ఓవర్లో మార్క్ వుడ్ ఆసీస్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతడు వేసిన 14 ఓవర్లో మూడో బంతికి స్టోయినిస్.. డేవిడ్ మలన్ కు క్యాచ్ ఇవ్వగా చివరి బంతికి విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ (0) హేల్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ మాత్రం పట్టు విడవలేదు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా నిలకడగా ఆడుతూ ఆసీస్ ను విజయపథాన నడిపించాడు. కానీ వార్నర్ ను మార్క్ వుడ్ బోల్తా కొట్టించడంతో ఆసీస్ కు విజయంపై నమ్మకం సడలింది. వార్నర్ నిష్క్రమించినా మాథ్యూ వేడ్ (15 బంతుల్లో 21) ఉన్నాడన్న ధైర్యంతో ఉన్న ఆసీస్ పోరాడింది. ఆఖరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమనగా 19వ ఓవర్ ఐదో బంతికి టాప్లీ.. డేనియల్ సామ్స్ (6) ను పెవిలియన్ చేర్చాడు. ఇక చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా సామ్ కరన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన మాథ్యూ వేడ్.. మూడో బంతికి స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో బంతికి నాథన్ ఎల్లిస్ (0) బౌల్డ్ అయ్యాడు. దాంతో ఆసీస్ పరాజయం ఖరారైంది. చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ ను నిలువరించారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. సిరీస్ లో తదుపరి మ్యాచ్ ఈనెల 12న కాన్‌బెర్రాలో జరుగుతుంది.
