Australia Vs England: యాషెస్ టెస్టులో  ఆసీస్  డ్రీమ్ స్టార్ట్ చేసింది. గబ్బా టెస్టులో ఇంగ్లాండ్ ను తొలి దెబ్బ తీసింది. ఆసీస్ కొత్త కెప్టెన్  పాట్ కమిన్స్.. ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కకావికలం చేశాడు. ఆసీస్ పేస్ త్రయానికి ఇంగ్లాండ్ విలవిల్లాడింది.  

ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్ ను Australia ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన England కు ఆ ఆనందం లేకుండా చేసింది. బ్రిస్బేన్ లోని Gabba వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఆసీస్ పేస్ త్రయం మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, కెప్టెన్ Pat Cummins లు ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. టెస్టులలో ఆసీస్ కు 47వ సారథిగా నియమితుడైన పాట్ కమిన్స్.. కెప్టెన్ గా తొలి టెస్టులోనే డ్రీమ్ స్టార్ట్ చేశాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి యాషెస్ లో Aissiesకు ఘనమైన ఆరంభాన్నిచ్చాడు. 

గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి Joe Root.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ ఆనందం ఇంగ్లీష్ జట్టుకు ఎంతో సేపు నిలువలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే మిచెల్ స్టార్క్.. ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్ ను బౌల్డ్ చేసి ఆ జట్టు పతనాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. యాషెస్ చరిత్రలో తొలి టెస్టు తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్ గా రికార్డులకెక్కాడు. 

గతంలో 1936లో ఆస్ట్రేలియా పేసర్ ఎర్నీ మెక్కార్మిక్ ఇంగ్లాండ్ ఓపెనర్ స్టాన్ వర్తింగ్టన్ ను తొలి టెస్టు.. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేశాడు. 85 ఏండ్ల తర్వాత స్టార్క్ ఆ రికార్డును తిరగరాశాడు. 

Scroll to load tweet…

బర్న్ ఔట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలన్ (6) ను హెజిల్వుడ్ ఔట్ చేయగా.. ఆ వెంటనే అతడు ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ (0) ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత వచ్చిన ఆల్ రౌండర్ Ben Stokes (5) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలువలేదు. సుమారు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న అతడిని కమిన్స్ సూపర్బ్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. ఓపెనర్ హసీబ్ హమీద్ (25) కొద్దిసేపు ప్రతిఘటించినా.. 26 ఓవర్లో కమిన్స్ అతడిని పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఓలీ పోప్ (35), వికెట్ కీపర్ జోస్ బట్లర్ (39) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 

Scroll to load tweet…

వీరిరువురు కలిసి ఆరో వికెట్ కు 52 పరుగులు జోడించారు. కానీ స్టార్క్ ఈ జోడీని విడదీశాడు. ఇక ఆ తర్వత ఇంగ్లాండ్ పతనం వేగంగా సాగింది. లోయరార్డర్ బ్యాటర్లు ఎవరు కూడా ఆసీస్ బౌలర్లను అడ్డుకోలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్.. 50.1 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ 13.1 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్.. 12 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. హెజిల్వుడ్ 13 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కామరూన్ గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది.