Asianet News TeluguAsianet News Telugu

ENG vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. పంత్ సెంచరీ.. నిలిచిన జడ్డూ..

England vs India: ఎడ్జబాస్టన్ టెస్టు తొలి రోజే భారీ మలుపులు తిరిగింది. రిషభ్ పంత్ ఇన్నింగ్ కు ముందు.. ఇన్నింగ్స్ తర్వాత  అన్నట్టుగా సాగింది.  

ENG vs IND: Day 1 Ends, India 338-7 After Rishabh Pant and Ravindra Jadeja Heroics in Edgbaston Test
Author
India, First Published Jul 1, 2022, 11:48 PM IST

ఎడ్జబాస్టన్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య  జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజే  అనూహ్య మలుపులు తిరిగింది.  ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.  ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ముందు టీమిండియా బెంబేలెత్తగా ఆ తర్వాత రిషభ్ పంత్ వచ్చి.. ఇంగ్లాండ్ బౌలర్లకు  పట్టపగలే చుక్కలు చూపించాడు. మధ్యలో కాసేపు వరుణుడు అడ్డుకున్నాడు.  ఇక చివరి సెషన్ లో మళ్లీ ఇంగ్లాండ్ ఆధిక్యం సాధించింది. మొత్తంగా కాస్త చేదు కాస్త తీపి అన్నట్టుగా గడిచిన తొలి రోజులో భారత జట్టు.. 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. 

ఒకదశలో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా అసలు 200 స్కోరు అయినా  చేస్తుందా..? అన్న  ప్రశ్నల నుంచి మెరుగైన స్కోరు దిశగా సాగుతున్నదంటే దానికి కారణం వికెట్ కీపర్  రిషభ్ పంత్. అతడు 111 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 రన్స్ చేశాడు. కీలక సమయంలో సెంచరీతో ఆదుకుని భారత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంత్ కు తోడుగా  రవీంద్ర జడేజా (163 బంతుల్లో 83 నాటౌట్.. 10 ఫోర్లు)  కూడా రాణించాడు. వీరిద్దరూ కలిసి అభేద్యమైన ఆరో వికెట్ కు ఇప్పటికే 222 పరుగులు జోడించారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఇంగ్లాండ్ బౌలర్లు షాకుల మీద షాకులిచ్చారు. ఓపెనర్లు శుభమన్ గిల్ (17), పుజారా (13) తో పాటు టాపార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లి (11), హనుమా విహారి (20), శ్రేయస్ అయ్యర్ (11) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో భారత జట్టు 27.5 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. కానీ పంత్, జడేజాలు తెగువతో బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుని క్రీజులో కుదురుకున్నాక రెచ్చిపోయారు. 

 

అయితే సెంచరీ తర్వాత పంత్ ఔటవ్వడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (1) కూడా త్వరగానే ఔటయ్యాడు. అయితే జడ్డూ, షమీ (0 నాటౌట్) మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు తీయగా. మాథ్యూ పాట్స్ 2 వికెట్లు పడగొట్టాడు. బెన్ స్టోక్స్, జో రూట్ లకు తలో వికెట్ దక్కింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios