మంచి మానసిక ఆరోగ్యం సాధించటం క్రికెట్‌ వంటి కఠినమైన ఆటలో ఆటగాళ్లకు అతి పెద్ద సవాల్‌ అని భారత మాజీ కెప్టెన్‌, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. 

2020 జనవరి-ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వేదికగా అండర్‌-19 ప్రపంచకప్‌ జరుగనుంది. లక్నోలో భారత్‌ అండర్ 19, అఫ్గనిస్థాన్‌ అండర్ 19 జట్లు పోటీపడుతున్నాయి. ప్రపం చకప్‌ జట్టుకు ఎంపిక చేయడానికి ముందు భారత-19 ఆడుతున్న చివరి సిరీస్‌ ఇదే. 

దీంతో కుర్రాళ్ల ఆట పర్యవేక్షణకు జూనియర్‌ సెలక్షన్‌ కమిటీతో సహా అండర్‌-19 చీఫ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ లక్నో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. 

Also read: ఒకే ఓవర్లో 5 వికెట్లు...కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ అరుదైన రికార్డు

' మానసిక ఆరోగ్యం నిలుపుకోవటం అతి పెద్ద సవాల్‌. క్రికెట్‌ కఠినమైన ఆట. ఎంతో పోటీతత్వం, విపరీతమైన ఒత్తిడిలో కుర్రాళ్లు ఏడాది పొడవునా ఆడుతున్నారు. ఇలాంటి ఆటలో కొన్నిసార్లు అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆలోచనకు అవసరమైన సమయం చిక్కుతుంది. మానసిక ఆరోగ్యంపై ఇప్పటికే ఎన్‌సీఏలో కొంత ముందడుగు వేస్తున్నాం. నాతో సహా ఇతర సహాయక కోచ్‌లు కొన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించగలం. కొన్ని సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా మానసిక నిపుణుల సహాయం అవసరం. యువ క్రికెటర్ల మానసిక ఆరోగ్యం కోణంలో త్వరలోనే నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో మానసిక నిపుణులు రానున్నారు. పోటీతత్వంతో కూడిన క్రికెట్‌లో సమన్వయం సాధించేందుకు మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానం' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.

భారతీయ పేసర్లే రోల్‌ మోడల్స్‌...

టీమ్‌ ఇండియాకు గొప్ప సీమర్లు ఉన్నారుని, కపిల్‌ దేవ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌ రూపంలో భారత్‌కు దిగ్గజ పేసర్లు ఉన్నారని, కానీ ఓ బృందంగా భారత్‌కు అత్యుత్తమ పేస్‌ దళం మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. 

ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలు తర్వాతి తరం క్రికెటర్లకు రోల్‌ మోడల్స్‌ కానున్నారని చెప్పుకొచ్చాడు.  ప్రస్తుత పేస్‌ దళాన్ని చూసి యువ బౌలర్లు సైతం పేస్‌ బౌలర్లుగా రాణించేందుకు కలలు కంటున్నారని, ఇది గొప్ప విషయం అని ద్రావిడ్ అన్నాడు.  

ఇప్పటివరకూ బ్యాట్స్‌మెన్‌ విన్యాసాలు చూసేందుకే అభిమానులు ఎక్కువగా స్టేడియానికి వస్తున్నారని, కానీ రానున్న కాలంలో పేసర్ల ప్రదర్శన కోసం వచ్చే అవకాశం లేకపోలేదని తన ఫీలింగ్స్ ను పంచుకున్నాడు. 

Also read; సంజు శాంసన్ ఎంపిక... పంత్ కు లక్ష్మణ్ చురకలు

గత అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టులో కమలేశ్‌ నగర్‌కోటి, శివం మావి, ఇషాన్‌ల రూపంలో మంచి పేసర్లు ఉన్నారని, రానున్న వరల్డ్‌కప్‌ కల్లా నాణ్యమైన యువ పేసర్లు అందుబాటులోకి రానున్నారని ఖచ్చితంగా చెప్పాగలనని వ్యాఖ్యానించాడు. 

నిజమైన సక్సెస్ అంటే విజయం కాదు... 

తాను గతంలోనే చాలాసార్లు చెప్పానని, జూనియర్‌ స్థాయిలో ఫలితం ప్రధానం కాదని, జూనియర్‌ స్థాయి నుంచి సీనియర్‌ స్థాయికి చేరుకోవటమే నిజమైన విజయం అని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.  

గత 14-16 నెలల్లో భారత్‌ అండర్‌-19 జట్టుకు 40-45 ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించారని,  ఇది గొప్ప ఘనత అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. రానున్న రెండేండ్లలో కనీసం 30-35 మంది ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగుపెడతారని, అందులో 10-15 మంది ఫస్ట్‌ క్లాస్‌ జట్లలో నిలదొక్కుకుంటారని విశ్వాసం వ్యక్తం చేసాడు. జూనియర్‌ జట్టు కోచ్‌గా తాను, తన టీం సాధించే నిజమైన విజయంగా రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.