ఎమర్జింగ్ ఆసియా కప్: సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ... పాకిస్తాన్‌ని చిత్తు చేసిన టీమిండియా...
. గ్రూప్ Bలో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి టీమిండియా... పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం... సాయి సుదర్శన్ అజేయ సెంచరీ, 5 వికెట్లు తీసిన రాజవర్థన్ హంగర్‌గేకర్..

ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 టోర్నీలో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 8 వికెట్ల ఘన విజయం అందుకున్న టీమిండియా.. గ్రూప్ Bలో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ A జట్టు 48 ఓవర్లలో 205 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
రియాన్ పరాగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సయీం ఆయుబ్ 11 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఆయుబ్‌ని అవుట్ చేసిన రాజవర్థన్ హంగర్‌గేకర్, అదే ఓవర్‌లో 4 బంతులు ఆడిన ఓమర్ యూసఫ్‌ని డకౌట్ చేశాడు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్...
36 బంతుల్లో 8 ఫోర్లతో 35 పరుగులు చేసిన సహబ్‌జాదా ఫర్హాన్, రియాన్ పరాగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 55 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కొట్టకుండా 27 పరుగులు చేసిన హసీబుల్లా ఖాన్, మనవ్ సుథార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
కమ్రాన్ గులామ్ 15, మహ్మద్ హారీస్ 14, ఖాసీం అక్రమ్ 48, ముబాసిర్ ఖాన్ 28, మహ్మద్ వసీం జూనియర్ 8, దహానీ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మెహ్రాన్ ముంతాత్ 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 48 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు, ఒకే ఒక్క పరుగు ఎక్స్‌ట్రా రూపంలో ఇచ్చారు. అది కూడా లెగ్ బై రూపంలో వచ్చిందే. భారత బౌలర్లలో రాజవర్థన్ హంగర్‌గేకర్ 5 వికెట్లు తీయగా మనవ్ సుథార్‌కి 3 వికెట్లు దక్కాయి. నిశాంత్ సింధు, రియాన్ పరాగ్‌కి చెరో వికెట్ దక్కింది..
206 పరుగుల లక్ష్యాన్ని 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. తొలి వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన అభిషేక్ శర్మను ముబసర్ ఖాన్ అవుట్ చేయగా సాయి సుదర్శన్, నికిన్ జోష్ కలిసి రెండో వికెట్‌కి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
64 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసిన నికిన్ జోష్, మెహ్రన్ ముంతాజ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేయా సాయి సుదర్శన్ 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి సెంచరీ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు..
విజయానికి 12 పరుగులు కావాల్సిన దశలో వరుసగా 4, 0, 6, 6 బాదిన సాయి సుదర్శన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.