నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత A జట్టు... గ్రూప్ B నుంచి సెమీ ఫైనల్‌కి ఇండియా, పాకిస్తాన్... రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్..
మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత A జట్టు, సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నేపాల్, 39.2 ఓవర్లలో 167 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కుశాల్ బుర్టెల్ డకౌట్ కాగా అసిఫ్ షేక్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దేవ్ ఖనాల్ 15 పరుగులు చేయగా 4 పరుగులు చేసిన భిమ్ శక్తిని హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. కుశాల్ మల్లా డకౌట్ కావడంతో 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది నేపాల్..
14 పరుగులు చేసిన సోమల్ కమితో కలిసి ఐదో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ పౌడెల్, గుల్సాన్ జాతో కలిసి ఏడో వికెట్‌కి 54 పరుగులు జోడించి నేపాల్‌ని ఆదుకునే ప్రయత్నం చేశాడు..
85 బంతుల్లో 7 ఫోర్లతో 65 పరుగులు చేసిన రోహిత్ పౌడెల్, నిశాంత్ సింధు బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన గుల్సాన్ జా కూడ నిశాంత్ సింధు బౌలింగ్‌లోనే అవుట్ కాగా పవన్ సరాఫ్, రాజ్‌భన్సీ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు..
హర్షిత్ రాణా 2 వికెట్లు తీయగా రాజవర్థన్ హంగర్‌గేకర్ 3 వికెట్లు తీశాడు. నిశాంత్ సింధుకి 4 వికెట్లు దక్కగా మనవ్ సుథర్ ఓ వికెట్ పడగొట్టాడు.
168 పరుగుల లక్ష్యాన్ని 22.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది భారత A జట్టు. 69 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రోహిత్ పౌడెల్ బౌలింగ్‌లో కుశాల్ మల్లాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి వికెట్‌కి సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ కలిసి 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
సాయి సుదర్శన్ 52 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేయగా ధృవ్ జురెల్ 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి భారత జట్టుకి మెరుపు ముగింపు అందించాడు..
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ A జట్టు 184 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. గ్రూప్ Bలో వరుసగా రెండేసి మ్యాచులు గెలిచి ఇండియా, పాకిస్తాన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్ల మధ్య జూలై 19న ఆఖరి గ్రూప్ మ్యాచ్ జరగనుంది..
గ్రూప్ Aలో రెండు విజయాలు అందుకున్న ఆఫ్ఘాన్ సెమీ ఫైనల్ చేరడం దాదాపు ఖాయం కాగా మిగిలిన ప్లేస్ కోసం బంగ్లాదేశ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి ఒక్కో మ్యాచ్ ఓడిపోయాయి. బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్‌తో ఆఖరి గ్రూప్ మ్యాచ్ ఆడబోతుంటే, శ్రీలంక, ఓమన్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది..
జూలై 21న సెమీ ఫైనల్స్, జూలై 23న ఫైనల్ మ్యాచ్ జరగబోతున్నాయి.
