Asianet News TeluguAsianet News Telugu

తెలిసన్నాడా.. తెలియకన్నాడా..? ఆర్సీబీ కప్ గెలవదని తేల్చేసిన డుప్లెసిస్..

IPL 2023: ఆర్సీబీ అభిమానులు ప్రతి సీజన్ కు ముందు    ‘ఈసాలా కప్ నమ్దే’  (ఈసారి కప్ మనదే) అంటూ నానా  హంగామా చేస్తారు. కానీ దానికి అనుగుణంగా  ఆటగాళ్ల ఆట మాత్రం ఉండదు.  

Ee Sala Cup Nahi: RCB Skipper  Faf Du Plessis Makes Blunder, Video Went Viral MSV
Author
First Published Apr 2, 2023, 1:30 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  మిగతా  ఫ్రాంచైజీలన్నీ ఓ ఎత్తయితే  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఎత్తు.  ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అంతర్జాతీయ స్టార్లు,   అదిరిపోయే ఆల్ రౌండర్లు,  ఏ క్షణంలో అయినా మ్యాచ్ లను మలుపు తిప్పే   హిట్టర్లు ఉన్న ఆ జట్టు  ఇంతవరకూ ఐపీఎల్ లో కప్ కొట్టలేదు.    కానీ ప్రతి సీజన్ లో  ఆ జట్టు అభిమానులు మాత్రం  ‘ఈసాలా కప్ నమ్దే’  (ఈసారి కప్ మనదే) అంటూ  హంగామా చేస్తారు.    దానికి అనుగుణంగా  ఆటగాళ్ల ఆట మాత్రం ఉండదు.  

వాస్తవానికి  ఆర్సీబీ   స్లోగన్ ‘ప్లే బోల్డ్..’ అంటే  ఏ బెరుకూ లేకుండా  ఆడటం.  కానీ ఆర్సీబీ అభిమానులకు   ప్లే బోల్డ్  కన్నా   ‘ఈ సాలా కప్ నమ్దే’నే  గుర్తుంటుంది.  ఒకరకంగా వారికి అదో   సత్య ప్రవచనంలా మారింది.  అయితే  15 ఏండ్లుగా   కప్  మనదే అంటూ కప్  కు దూరంగా  ఉంటున్న ఆర్సీబీ.. ఈసారి కూడా  ట్రోఫీ గెలవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. 

విశ్లేషకుల సంగతి పక్కనబెడితే  స్వయంగా ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కూడా  ‘ఈసాలా కప్ నహీ’అంటున్నాడు.   అదేంటి..?  ఆ జట్టుకు కెప్టెన్ అయ్యుండి అంత మాట అన్నాడా..? అంటే మాత్రం  అతడు కావాలని అన్నదైతే కాదు.  శనివారం  ఓ కార్యక్రమంలో  విరాట్ కోహ్లీతో కలిసి పాల్గొన్న డుప్లెసిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.  అక్కడున్న వారు ఏదో  అడుగుతుండగా  కోహ్లీ.. డుప్లెసిస్ చెవుల్లో  ‘ఈసాలా కప్ నమ్దే’అనమని చెప్పాడు.   అప్పుడు ఆర్సీబీ కెప్టెన్ మైక్ అందుకుని  ‘ఈసాలా కప్ నహీ’అనేశాడు.  దీంతో   పక్కనున్న కోహ్లీతో పాటు అక్కడున్నవాళ్లంతా  పడీ పడీ నవ్వారు.  

 

డుప్లెసిస్ ఈ మాట తెలిసన్నాడో తెలియక అన్నాడో తెలియదు గానీ  ఆర్సీబీ అభిమానులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కెప్టెన్ అయ్యుండి  ఆర్సీబీ కప్ గెలవదు అని చెప్పడమేంటని  ట్విటర్ వేదికగా  ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఆర్సీబీ  అపోజిషన్ టీమ్  ఫ్యాన్స్ మాత్రం  డుప్లెసిస్  వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈ సీజన్ లో ఆర్సీబీ  ఫ్యూచర్ ను   ఫాఫ్ ముందే గ్రహించాడు.  ఈ టీమ్ తో కప్ గెలవడం కష్టమని తెలిసే  ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ ఏడాది కూడా మీ కథ కంచికే..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

కాగా  ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు..  ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. రాత్రి  7.30 గంటల నుంచి  ఈ మ్యాచ్ మొదలుకానుంది.  ఆర్సీబీ తరఫున కీలక బౌలర్ జోష్ హెజిల్వుడ్ లేకపోవడంతో  ఆ జట్టు మహ్మద్ సిరాజ్ మీదే  భారీ ఆశలు పెట్టుకుంది.  కొత్తగా జట్టుతో చేరిన ఆల్ రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్ ఏ మేరకు  మెరుపులు మెరిపిస్తాడోనని చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios