లంకకు గాయాల బెడద.. టోర్నీకి మరో స్టార్ పేసర్ దూరం..! ఇలాగైతే నెదర్లాండ్స్ మీద గెలిచేనా..?
T20 World Cup 2022: ఆసియా కప్ గెలిచి అదే ఊపులో టీ20 ప్రపంచకప్ లో సత్తా చాటాలని చూస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా ఓ పేసర్ దూరం కాగా ఇప్పుడు మరో స్టార్ పేసర్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరిన శ్రీలంకకు శకునం బాగలేనట్టుంది. ఆ జట్టుకు వరుసగా షాకులు తాకుతున్నాయి. అసలే నమీబియా మీద ఓడి క్వాలిఫై కష్టాలు ఎదుర్కుంటున్న ఆ జట్టు నిన్న యూఏఈ మీద గెలిచామన్న ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఆ జట్టు ప్రధాన పేసర్ దుష్మంత చమీర గాయపడ్డాడు. గాయం తీవ్రత పరిశీలించిన తర్వాత చమీరకు విశ్రాంతి అవసరమని తేలడంతో అతడు ఈ మెగా టోర్నీకి దూరమైనట్టేననే వార్తలు వినిపిస్తున్నాయి.
చమీర ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఆడలేదు. మోకాలి కండరాల గాయం కారణంగా అతడు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో చమీర ఉన్నాడు. నమీబియాతో మ్యాచ్ ఓడిన తర్వాత తప్పక గెలవాల్సిన యూఏఈతో మ్యాచ్ లో చమీర చెలరేగాడు. 3.5 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ బౌలింగ్ చేసేప్పుడు చమీరకు గాయం తిరగబెట్టింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి తగిన పరీక్షలు నిర్వహించగా అతడు తదుపరి నెదర్లాండ్స్ తో మ్యాచ్ తో పాటు టోర్నీ మొత్తానికి ఆడకుంటేనే మంచిదని వైద్యులు చెప్పినట్టు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో చమీర మెగా టోర్నీకి దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి.
చమీర ఒక్కడే కాదు.. గాయాల కారణంగా లంక క్రికెట్ జట్టులో ఇది వరకే యువ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా ఈ టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. నమీబియాతో మ్యాచ్ కు ముందు మధుశంక ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా మధుశంక గాయం తీవ్రమైందని తేలడంతో అతడు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు.
ఈ ఇద్దరే గాక లంక బ్యాటర్ దనుష్క గుణతిలక, పేసర్ ప్రమోద్ మధుషన్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. రేపు (గురువారం) శ్రీలంక నెదర్లాండ్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ వరకు వీళ్లు గనక గాయపడితే అప్పుడు లంక పరిస్థితి మరీ దారుణమవుతుంది.