James Franklin in Big Trouble: తనపై భౌతిక దాడికి దిగారని ఆరోపిస్తూ రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్  ఇటీవల చేసిన వ్యాఖ్యలు  పెద్ద దుమారమే లేపుతున్నాయి.  తాజాగా ఈ దాడిలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఫ్రాంక్లిన్ కు తొలి పంచ్ పడింది. 

తాను ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ తో పాటు న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ లు తనపై భౌతిక దాడికి దిగారని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న న్యూజిలాండ్ పేసర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ కు తొలి పంచ్ పడింది. చాహల్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా అతడు హెడ్ కోచ్ గా పని చేస్తున్న డర్హమ్ (ఇంగ్లాండ్) కౌంటీ క్రికెట్ క్లబ్ కోరనున్నది. ఈ మేరకు అతడితో ఈ విషయమై మాట్లాడతామని డర్హమ్ కౌంటీ ప్రతినిధులు తెలిపారు. 

2011 లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్ గెలిచిన సందర్భంగా అప్పటి జట్టులో ఉన్న సైమండ్స్, ఫ్రాంక్లిన్ లు తనను హోటల్ గదిలో చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి.. రూమ్ కు బయట గడియ పెట్టి వెళ్లారని ఆరోపించాడు.

చాహల్ చెప్పిందిది.. 

ఈ ఏడాది ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓ పోడ్కాస్ట్ లో పాల్గొన్న చాహల్ మాట్లాడుతూ.. ‘ఇది 2011 లో జరిగింది. ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్ గెలిచినప్పుడు సైమండ్స్, ఫ్రాంక్లిన్ లు ఫుల్లుగా తాగారు. అప్పుడు గదిలో మేమిద్దరమే ఉన్నాం. ఆ సమయంలో వాళ్లు నా చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి, హోటల్ రూమ్ కు బయట గడియ పెట్టారు. కట్లు విప్పాలని నేను ఎంత బతిమిలాడినా వాళ్లు వినలేదు. నువ్వే తీసుకోవాలని అని నాతో చెప్పుకుంటూ అక్కడ్నుంచి వెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం హోటల్ రూమ్ క్లీన్ చేసే వాళ్లు వచ్చినతర్వాత నన్ను చూసి నా నోటికున్న ప్లాస్టర్ తీసేశారు...’ అని చెప్పుకొచ్చాడు.

దీంతోపాటు ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ లో విడుదల చేసిన వీడియోలో.. 2013లో తనను ముంబై ఇండియన్స్ ఆటగాడు ఒకరు పీకలదాకా తాగి 15వ అంతస్తు నుంచి కిందికి తోసేయబోయాడంటూ చాహల్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అతడిని తోసేయబోయింది ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే చాహల్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లు తీవ్రంగా స్పందించారు. చాహల్ అతడి పేరును వెల్లడించాలని కోరారు. కానీ చాహల్ మాత్రం అతడి పేరును చెప్పలేదు. 

Scroll to load tweet…

డర్హమ్ ఏమందంటే..

చాహల్ వ్యాఖ్యలకు డర్హమ్ ఆలస్యంగా మేల్కొంది. తాజాగా దీనిపై స్పందిస్తూ... ‘ఇటీవలి కాలంలో మా కోచింగ్ స్టాఫ్ కు సంబంధించిన ఓ వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయన్న విషయం మాదాకా వచ్చింది. అయితే ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్లతో ప్రైవేట్ గా మాట్లాడతాం. వాళ్ల వాదనలు వింటాం. వాస్తవాలు తేలుస్తాం..’ అని తెలిపింది. మరి ఫ్రాంక్లిన్ వాదనలు విన్నాక డర్హమ్ క్లబ్ అతడిపై చర్యలు తీసుకుంటుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.