రోహిత్‌లా బ్యాటింగ్ చేస్తా.. కపిల్‌దేవ్‌లా బౌలింగ్ చేస్తా.. హిట్‌మ్యాన్‌ను ఇంప్రెస్ చేసిన బుడ్డోడి స్టోరీ ఇది.
T20 World Cup 2022: టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓ 9 ఏండ్ల బుడ్డోడు భారత సారథి రోహిత్ శర్మకు బౌలింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. దీంతో ఎవరీ బుడ్డోడు..? అని నెటిజన్లు తెగ వెతికారు.
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. ఈ మ్యాచ్‌లలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓ 9 ఏండ్ల బుడ్డోడు భారత సారథి రోహిత్ శర్మకు బౌలింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. దీంతో ఎవరీ బుడ్డోడు..? అని నెటిజన్లు తెగ వెతికారు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రేలను ఇంప్రెస్ చేసిన దృషీల్ చౌహాన్ కథ ఇది...
పట్టుమని పదేండ్లు కూడా లేని దృషీల్ కు క్రికెట్ అంటే ప్రాణం. దృషీల్ కంటే ముందు అతడి తండ్రి గురించి చెప్పుకోవాలి. వడోదర (గుజరాత్) కు చెందిన మెహుల్ చౌహాన్ కు చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే పిచ్చి. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలను ఆకర్షించిన 1983 వన్డే వరల్డ్ కప్ విజయం.. మెహుల్ నూ అటుదిశగా మళ్లించింది. కానీ అతడి కలలు నెరవేరలేదు.
జీవన పోరాటంలో మెహుల్ చిరునామా వడోదర నుంచి పెర్త్ (ఆస్ట్రేలియా)కు మారింది. అయితే తాను క్రికెటర్ కాలేకపోయినా తన కొడుకును మాత్రం పక్కా క్రికెటర్ చేయాలనే పట్టుదలతో ఉన్న మెహుల్.. చిన్నప్పట్నుంచే ఆ విధంగా సిద్ధం చేశాడు. 1983 వరల్డ్ కప్ విజయం తో పాటు భారత జట్టు ఆడిన కీలక మ్యాచ్ ల వీడియోలను చిన్నారి దృషీల్ కు చూపించేవాడు. బిగ్ బాష్ లీగ్ లో మ్యాచ్ లను చూడటానికి తనతో పాటు కొడుకును కూడా తీసుకెళ్లేవాడు. సాధారణంగా చిన్నప్పుడు పిల్లలు ఏది ఎక్కువ చూస్తే దానివైపునకే మళ్లుతారు.. ఇదే సూత్రం ఇక్కడా అప్లై అయింది. దృషీల్ కూడా క్రికెట్ మీద మక్కువ పెంచుకున్నాడు. కొడుకు క్రికెటర్ కావాలనుకున్న మెహుల్ కు కావాల్సింది కూడా అదే కావడంతో ఆ దిశగా ఈ చిన్నోడిని ప్రోత్సహిస్తున్నాడు.
ఆ విషయం తెలుసుకుని..
తన జీవితంలో ఒక్క క్రికెటర్ ను కూడా కలవలేకపోయిన మెహుల్.. తన కొడుకుకు మాత్రం అలా కావొద్దని అనుకున్నాడు. పెర్త్ కు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేందుకు వస్తుందని తెలుసుకున్న మెహుల్.. తన కొడుకుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా లను కలిపించాలని చూశాడు. తద్వారా దృషీల్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావించాడు. తిప్పలు పడి పెర్త్ లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ చేసే గ్రౌండ్ కు వెళ్లాడు. వాకా స్టేడియంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ కు రాగానే దృషీల్.. ‘హే రోహిత్ శర్మ.. నేను దృషీల్..’ అని అరిచాడు. తిరిగి చూసిన రోహిత్.. అతడి వంక ఓ నవ్వు నవ్వాడు. దృషీల్ గురించి తెలుసుకున్న రోహిత్.. అతడిని నెట్స్ లోకి పంపించండని కోరాడు. అంతే.. తండ్రీ కొడుకుల ఆనందానికి అవధుల్లేవు. తన కొడుకుకు ఇంతకుమించిన అవకాశం రాదని.. దృషీల్ షూ లేస్ కట్టి.. బాగా బౌలింగ్ చేయాలని పంపాడు. ఈ బుడ్డోడి బౌలింగ్ కు ఫిదా అయిన రోహిత్.. అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి తనతో పాటు డ్రెస్సింగ్ రూమ్ కు కూడా తీసుకెళ్లాడు.
ఆల్ రౌండర్ ను అవుతా..
తాను రోహిత్ శర్మను కలవడంతో పాటు ద్రావిడ్, ఇతర ఆటగాళ్లను కలవడంపై దృషీల్ స్పందిస్తూ.. ‘నేను రోహిత్ కు పెద్ద ఫ్యాన్ ను. అతడికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించా.. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, యార్కర్, షార్ట్ లెంగ్త్ డెలివరీ వేశా. నేను ఒక ఓవర్లో ఆరు బంతులను ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తా. కానీ నా బౌలింగ్ ను హిట్ మ్యాన్ ఈజీగా ఎదుర్కున్నాడు. ఆ తర్వాత నన్ను పిలిచి మెచ్చుకున్నాడు. నా గురించి వివరాలు అడిగాడు. మేము క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం. రోహిత్ శర్మతో మాట్లాడటం నాకు దక్కిన గౌరవంగా అనిపించింది. రోహిత్ నన్ను డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ నేను రాహుల్ ద్రావిడ్ ను కూడా కలిశాను. ద్రావిడ్ నా బౌలింగ్ ను మెచ్చుకున్నాడు...
నేను భవిష్యత్ లో రోహిత్ శర్మ మాదిరిగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా.. బౌలింగ్ లో నాకు కపిల్ దేవ్ ఆదర్శం. నేను ఆల్ రౌండర్ ను అవుతా. రోహిత్ శర్మ నాకు టిప్స్ కూడా చెప్పాడు...’ అని 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు దృషీల్.