Asianet News TeluguAsianet News Telugu

Ind vs Pak: అలా అయితే క్రికెట్ చూడటం మానేయండి.. షమీని ట్రోల్ చేస్తున్నవారికి హర్షా భోగ్లే స్ట్రాంగ్ కౌంటర్

T20 Worldcup2021: షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలుస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు.

Dont watch cricket: Commentator harsha Bhogle slams Trollers hatred against Team india bowler mohammad shami
Author
Hyderabad, First Published Oct 26, 2021, 1:40 PM IST | Last Updated Oct 26, 2021, 1:40 PM IST

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ లో టీమిండియా (Team India) దారుణ పరాభవాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొంతమంది  అభిమానులు  ఆ వేదనను భరిస్తుంటే మరికొంత మంది  మాత్రం ఆన్లైన్ వేదికగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. టీమిండియాకు, ముఖ్యంగా భారత పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami)కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. 

అతడిని పాకిస్థాన్ (Pakistan) కు వెళ్లిపోవాలని అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారు.  షమీ మతాన్ని వేలెత్తి చూపుతూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు. అతడి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇందులోకి లాగుతున్నారు. 

మరోవైపు షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలుస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సెహ్వాగ్ (Virender Sehwag), గంభీర్ (Gowtham Gambhir), ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు. ఇక తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) కూడా షమీకి మద్దతుగా నిలిచాడు. షమీని ట్రోల్ చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

 

భోగ్లే స్పందిస్తూ.. ‘మహ్మద్ షమీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్లందరికీ నా వినతి. మీరు క్రికెట్ చూడకండి. అప్పుడు మీరు ఏదీ మిస్ అవ్వరు’ అని ట్వీట్ చేశాడు. 

పాక్ పై మ్యాచ్ ఓడిపోగానే పలువురు ఆకతాయిలు షమీ ఇన్స్టాగ్రామ్ కు.. ‘సర్ టీమిండియా ఓడిపోయింది, అయితే మీరు సంతోషిస్తూ ఉండొచ్చు. మీ వాళ్ల టీమ్ గెలిచింది కదా... సారీ మీరే గెలిపించారు...’ అంటూ తీవ్రంగా దూషిస్తూ, అసభ్యపదజలంతో మహ్మద్ షమీపై దాడికి పాల్పడుతున్నారు.  

 

 

షమీకి అండగా నిలిచిన సచిన్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘మేం టీమిండియాకు  మద్దతుగా నిలవడం అంటే జట్టులోని ప్రతి ఆటగాడికి మద్దతు తెలిపినట్టే. షమీ అంకితభావం ఉన్న ప్రపంచస్థాయి బౌలర్. మిగతా క్రికెటర్ల లాగే అతడు కూడా ఒక రోజు విఫలమయ్యాడు. షమి, టీమిండియాకు నేను మద్దతుగా నిలుస్తున్నా’ అని రాసుకొచ్చాడు. 

 

 

ఇక వీరూ స్పందిస్తూ.. ‘మహ్మద్ షమీపై జరుగుతున్న ఆన్‌లైన్ అటాక్ చూసి షాక్ అయ్యా. మేం నీతో ఉన్నాం. నువ్వు ఓ ఛాంపియన్‌వి. భారత జెర్సీ వేసుకుని, టీమిండియా క్యాప్ పెట్టుకునే ప్రతీ ప్లేయర్‌ను ఇండియా తన గుండెల్లో పెట్టుకుని చూసి ఉంటుంది. ఇలాంటి ఆన్‌లైన్ హింసలు, వారిని ఏమీ చేయలేవు. నీతో ఉన్నా షమీ... తర్వాతి మ్యాచ్‌లో నువ్వేంటో వీళ్లకు చూపించు...’ అంటూ ట్వీట్ చేశాడు. 

 

 

ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పాక్.. 18 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో షమీ 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. తొలి మూడు ఓవర్లు బాగానే వేసిన షమీ.. ఆఖరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే ఇప్పుడు అతడి పాలిట శాపమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios