మరికొద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ కప్ మెగా టోర్నీ కోసం ఎంపికచేసిన భారత జట్టులో దినేశ్ కార్తిక్ కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ అవకాశం కోసం అతడు యువ ఆటగాడు రిషబ్ పంత్ తో తీవ్రంగా పోటీ పడాల్సి వచ్చింది.  చివరకు అతడి అనుభవమే అతన్ని గట్టెక్కించింది. సుధీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో   అనుభవం, ఒత్తిడిని తట్టుకుని చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, మరీ ముఖ్యంగా వికెట్  కీపర్ గా మెరుగ్గా రాణిస్తుండటాన్ని పరిగణలోకి తీసుకుని సెలెక్టర్లు దినేశ్ కు మరోసారి ప్రపంచ కప్ లో ఆడే అవకాశాన్నిచ్చారు.  

ప్రపంచ కప్ జట్టుతో తనకు చోటు దక్కడంపై దినేశ్ కార్తిక్ స్పందించారు.  '' భారత జట్టులో చోటు దక్కిందని తెలుసుకుని చాలా ఉద్వేగానికి లోనయ్యాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నీలో భారత్ తరపున ఆడాలన్న నాకల సాకారమైంది. ఇక్కడివరకు చేరుకోడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు చెబుతున్నా'' అన్నారు. దినేశ్ కార్తిక్ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారికి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

 2007లో మొదటిసారి భారత జట్టు తరపున దినేశ్ కార్తిక్ ప్రపంచ కప్ ఆడారు. ఆ తర్వాత 2011,2015 వరల్డ్ కప్ లలో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయితే మళ్లీ 12ఏళ్ల తర్వాత అతడికి మరోసారి ప్రపంచచ కప్ ఆడే అవకాశం వచ్చింది. దీంతో కార్తిక్ మరోసారి భారత జట్టు తరపున ప్రపంచ దేశాలతో తలపడనున్నారు. 

అయితే కార్తిక్ ను రిజర్వ్ వికెట్ కీపర్ గా మాత్రమే అవకాశమిచ్చినట్లు సెలెక్టర్లు వెల్లడించారు. రెగ్యులర్ వికెట్ కీపర ధోని జట్టుకు దూరమైన  సమయంలోనే అతడు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశారు. దీంతో దినేశ్ కార్తిక్ ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించినా తుది జట్టులో మాత్రం ఆడే అవకాశాలు తక్కువగా వున్నాయి. ఈ ఐపిఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ లో మే30 నుంచి జులై 14వరకు ఈసారి ప్రపంచకప్‌ జరగనుంది.