2020సంవత్సరం ప్రారంభమవడంతో కొత్త దశాబ్దంలోకి అడుగిడుతున్నాం. పాత దశాబ్దం ముగియడంతో ఆ దశాబ్దపు ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి వారితో ఒక జట్టును కూర్చే పనిలో అనేక క్రికెటింగ్ కు సంబంధించిన సంస్థలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ జట్లను ప్రకటించగా, తాజాగా  ఈఎప్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో తన దశాబ్దపు జట్టును ప్రకటించింది. 

సంస్థ ఏదైనా, ఫార్మటు టెస్టు అయినా వన్డే అయినా మన భారత జట్టు సభ్యులు లేకుండా ఆ టీం పూర్తయ్యే సవాలే లేదు. ఇటు బ్యాట్స్ మెన్ అయినా, అటు బౌలర్లయినా మనవారి హవా ప్రస్ఫుటంగా కనబడుతుంది. మన భారత మాజీ, ప్రస్తుత సారధులనయితే అన్ని సంస్థలు తమ జట్లకు నాయకులుగా ఎన్నుకుంటుండడం విశేషం. 

Also read: Year Roundup 2019: పి‌వి సింధు టాప్, మెరిసిన క్రీడా రత్నాలు వీరే..

భారత క్రికెట్‌ స్టార్స్‌ మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈ దశాబ్దపు జట్లలో చోటు సాధించారు. క్రికెట్‌ వెబ్‌సైట్‌ ఈఎప్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ప్రకటించిన 2010-2019 టెస్టు, వన్డే, టీ20 జట్లలో మనోళ్లు చోటు సంపాదించారు. 

54.97 సగటుతో 7202 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి టెస్టు జట్టులో నం.4 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలస్టర్‌ కుక్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ వంటి సారథులు ఉన్న టెస్టు జట్టుకు అందరిని తోసిరాజేస్తూ కోహ్లి నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. 

25.36 సగటుతో 362 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా టెస్టు జట్టులో ఉన్నాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఎం.ఎస్‌ ధోనిలు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. 

రోహిత్‌ శర్మ 52.92 సగటుతో 7991 పరుగులతో ఓపెనర్‌గా, 61.31 సగటుతో 11036 పరుగులతో విరాట్‌ కోహ్లి నం.3 బ్యాట్స్‌మన్‌గా, 50.35 సగటుతో 5640 పరుగులతో ఎం.ఎస్‌ ధోని నం.6 బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉన్నారు. 

Also read: బాలీవుడ్ సెలబ్రెటీస్ తో... విరుష్క జోడి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

ఆమ్లా, డివిలియర్స్‌, షకిబ్‌, స్టెయిన్‌, మలింగలతో కూడిన వన్డే జట్టు సారథ్య బాధ్యతలు ధోనికి దక్కాయి. టీ20 జట్టులో విరాట్‌ కోహ్లి, ఎం.ఎస్‌ ధోని, జస్ప్రీత్ బుమ్రా చోటు సాధించారు. వెస్టిండీస్‌ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, సునీల్‌ నరైన్‌, కీరన్‌ పొలార్డ్‌, ఆండ్రీ రసెల్‌, డ్వేన్‌ బ్రావోలు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.