ధర్మశాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భారత్-సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన టీ20  మ్యాచ్ రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. మైదానం మొత్తం పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోగా పిచ్ పై కప్పిన కవర్లపై కూడా భారీగా నిలిచిపోయింది. వర్షం తగ్గకపోగా అందకంతకు ఎక్కువవుతుండటంతో మ్యాచ్ ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. 

 టీ20 సీరిస్ లో భాగంగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ క వర్షం ఆటంకం సృష్టించింది. భారీ వర్షం కారణంగా పిచ్ పై ఇంకా కవర్లు కప్పివున్నాయి. మైదానంలో వర్షపు నిలిచిపోవడంతో పాటు జల్లులు కురుస్తూనే వున్నాయి. దీంతో టాస్ ఆలస్యమైంది.  

వెస్టిండిస్ పర్యటనలో  ఓటమన్నదే ఎరగకుండా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లను కూడా కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేసింది. ఇలా రెట్టించిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్దమైంది.అంతేకాకుండా ఈ సీరిస్ స్వదేశంలో జరగుతుండటం భారత్ కు మరింత కలిసివచ్చేది.

ఇక ప్రపంచ కప్ టోర్నీలో పేలవ ప్రదర్శన కారణంగా సఫారీ జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ నుండి టీ20 పగ్గాలను క్వింటన్ డికాక్ కు  అందించారు. భారత పర్యటనలోనే అతడు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. దీంతో మొదటి  మ్యాచ్ లోనే జట్టుకు విజయాన్ని అందించి ఆటగాళ్లలో  మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో డికాక్ పక్కా వ్యూహాలతో  జట్టును సిద్దం చేశాడు. 

ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇరు జట్ల ఆశలపై వర్షం నీళ్లుచల్లింది. అంతకంతకు వర్షం మరీ ఎక్కువయి  మ్యాచ్ ను పూర్తిగా తుడిచిపెట్టింది.