ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెెంగళూర్ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందు ఉంచిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బెంగళూర్ విఫలమైంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబడ, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ, రూథర్ ఫర్డ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందు ఉంచిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూర్ 160 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటికి విజయానికి బెంగళూర్ 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. గురు కీరత్ సింగ్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 111 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.అంతకు ముందు 108 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.బెంగళూర్ 103 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. డీవిల్లీర్స్ 17 పరుగులు చేసి రూథర్ ఫర్డ్ బౌలింగులో అవుటయ్యాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 68 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 23 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగులో అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన పార్థివ్ పటేల్ అంతకు ముందు 63 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు. 20 బంతుల్లో 39 పరుగులు చేసి రబడ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్.. బెంగళూరు ముందు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు ఇచ్చిన శుభారంభాన్ని కంటిన్యూ చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో సాయపడ్డాడు.

తర్వాతి బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా చివర్లో రూధర్‌ఫర్డ్ విజృంభించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 50, శ్రేయస్ అయ్యార్ 52 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 2, నవదీప్, ఉమేశ్ యాదవ్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. 

బెంగళూరు బౌలర్లు చివరి ఓవర్లలో విజృంభించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో కోలిన్ ఇన్‌గ్రామ్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నవదీప్ షైనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును పెంచే క్రమంలో ఔటయ్యాడు. అర్థసెంచరీ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నంలో 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుందర్ బౌలింగ్‌లో అయ్యర్ పెవిలియన్ చేరాడు. 

విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్‌ను చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ పెవిలియన్ చేరాడు. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్థసెంచరీ నమోదు చేశాడు. 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో దూకుడుగా ఆడిన అయ్యర్.. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 

నిలకడగా రాణించిన ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థసెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. చాహల్ బౌలింగ్‌లో వాషింగ్టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వరుస ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడిన గబ్బర్ కేవలం 36 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో ధావన్‌కు ఇది 3వ అర్థసెంచరీ

దూకుడు మీదున్న పృధ్వీషా 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పృథ్వీ, ధావన్ కలిసి తొలి వికెట్‌కు కేవలం 3 ఓవర్లలోనే 35 పరుగులు జోడించారు.

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ప్లేఆఫ్ చేరేందుకు ఈ మ్యాచ్‌తో పాటు మరో మూడు మ్యాచ్‌లను గెలవాల్సి ఉండగా.. ఢిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్‌కు అవకాశాన్ని దక్కించుకుంది..